మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాకీలకు తమ ప్రభుత్వం ఇప్పుడు వడ్డీలు చెల్లిస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలు నెరవేరిస్తే బాకీ కార్డు అంటారా? అ ని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాం గ్రెస్‌కే సాధ్యమని బిసి రిజర్వేషన్లతో మరోసారి స్పష్టమైందన్నా రు. బిసి రిజర్వేషన్లు అమలు చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్-బిజెపి కలిసి సంసారం చే స్తున్నాయని ఆయన విమర్శించారు.
రెండు పార్టీలు ఒక్కటై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. బాకీల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అవుతారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ బిఆర్‌ఎస్ ప్రచారం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన మీకు బకాయి అనే పదం కూడా పలికే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్లా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందికి దళిత బంధు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఐదు వందల రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం బాకీ పడ్డట్లా?, ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచడం బాకీ పడ్డట్లా? అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణ మాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వరికి బోనస్ ఇవ్వడం బకాయి పడ్డట్లా ? అని ఆయన బిఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్‌లో విజయం మాదే..
బిఆర్‌ఎస్ నవాబు పాలన సాగించిందని, తెలంగాణను సర్వ నాశనం చేసిందని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమాగా అన్నారు. బిసి రిజర్వేషన్ల గురించి బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బిసి నాయకుడైన బిజెపి ఎంపి ఈటల రాజేందర్ బిసి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. జిఎస్‌టి పేరిట కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ళుగా ప్రజలు సొమ్ము దోచుకున్నదని ఆయన దుయ్యబట్టారు. హైడ్రాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. దూరదృష్టితో హైడ్రా రూపకల్పన చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆదిత్య కనస్ట్రక్షన్ నిర్మాణంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.