హైదరాబాద్: మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని బిజెపి ఎంపి రఘునందనరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ జపం చేస్తోందని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నార్సంగిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని, ఆదిత్య వింటేజ్ బంగ్లాను మూసీ పరివాహకంలో నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆదిత్య వింటేజ్ నిర్మాణం ఆపివేస్తామందని, ఆదిత్య వింటేజ్ విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దకు తీసుకెళ్లాలని రఘునందన్ రావు అన్నారు. సర్వీస్ రోడ్డు ఆక్రమించి కట్టే భవనానికి హెచ్ఎండిఎ ఎట్లా అనుమతించిందని ప్రశ్నించారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణాన్ని పూర్తిగా ఎఫ్ టిఎల్ లోనే నిర్మిస్తున్నారని, ఆదిత్య వింటేజ్ నిర్మాణాలపై సిఎం, హైడ్రా కమిషనర్ కు లేఖ రాస్తున్నానని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తాం అని హెచ్చరించారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణంపై ఏ గద్ద వాలిందని.. ఎన్ని సూట్ కేసులు ఎత్తుకెళ్లిందని ఎంపి రఘునందనరావు ఎద్దేవా చేశారు.