కాంగ్రెస్ ‘బాకీ కార్డు’ ఆ పార్టీకి ఉరితాడైతదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ 700 రోజులైనా ఎందుకు నెరవేర్చాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలతో పాలన కొనసాగిస్తూ సిఎం కుర్చీ విలువ తీశారని మండిపడ్డారు. ప్రతి గడపగడపకు ఈ కాంగ్రెస్ బాకీ కార్డును అందించి, ఆ పార్టీ మోసపూరిత పాలనపై ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజా సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పథకాలు ప్రవేశపెట్టకుండా కెసిఆర్ పాలనలో అమలు చేసిన పథకాలను సైతం నిలిపి వేసిందని మండిపడ్డారు. అబద్ధపు హామీలను ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. ప్రజలు ఇచ్చిన హామీలను అడుగుతారని రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలు ఎన్నికల ముందు అధికారం కోసం బాండ్ పేపర్లు రాసి ఇచ్చి పంచారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి లంరు బిందెల కోసం వేట కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతుంటే పట్టించుకోని సర్కార్ ఊరుకో మద్యం దుకాణం పెడతామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చడమే లక్ష్యంగా ఈ సర్కార్ పెట్టుకుందని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కెసిఆర్ నియమించిన నియామక పత్రాలను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు.
మార్పు.. మార్పు అని గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బందిలోకి నెట్టారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో సగం కళాశాలలు జీతాలు, కిరాయిలు ఇవ్వలేక మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజలకు వైద్య సేవలు బంద్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు వెళ్లిన రేవంత్ అక్కడ బ్రేక్ ఫాస్ట్ పథకం చాలా బాగుందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ పథకాన్ని కెసిఆర్ ఎప్పుడో ప్రారంభించి కొనసాగించాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి రోడ్లన్నీ గుంతలమయం అయినా పట్టించుకోని రేవంత్ ఫ్యూచర్ సిటీ కోసం ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు,ప్రజల సంక్షేమం కోసం నిధులు లేవని చెప్పే కాంగ్రెస్ సర్కార్ కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే బీహార్ ఎన్నికలకు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో గ్రామాల్లో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. పార్టీషనులంతా కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కడవేరుగు రాజనర్సు, మా రెడ్డి రవీందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గుండు భూపేష్, పాల సాయిరాం, కూర మాణిక్య రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల అరవింద్ రెడ్డి, రాగుల సారయ్య, జంగిటి శ్రీనివాస్, శ్రీహరి యాదవ్, అహ్మద్, మల్లికార్జున్, నాగరాజు, శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.