వాషింగ్టన్ నుండి వచ్చిన చిత్రాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ సైనిక ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లను కలిసిన దృశ్యాలను చూపించాయి. ఈ సమావేశంలో, మునీర్ ట్రంప్‌కు ‘అరుదైన భూమి ఖనిజాలు’ అని పిలవబడే పాలిష్ చేసిన ట్రేని బహూకరించారు. వారు వైట్ హౌస్‌ను ఆకట్టుకోవాలని, అమెరికా నుండి పెట్టుబడులు పొందాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అరుదైన భూమిపై నియంత్రణ కోసం ప్రపంచం తీవ్రంగా పోటీ పడుతున్న సమయంలో పాకిస్తాన్‌ను కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరాదారుగా ప్రదర్శించడానికి ఈ ఫోటో ప్రయత్నంగా చెప్పవచ్చు. అయితే, మెరుస్తున్న రాళ్ల వెనుక, ఒక చీకటి కథ ఉంది. పాకిస్తాన్ సరఫరా చేయగలమని చెప్పుకునే చాలా ఖనిజాలు, పాకిస్తాన్ సైన్యానికి స్థావరంగా పంజాబ్ ప్రావిన్స్ నుండి లభించవు.
అమెరికా అధ్యక్షునితో పాకిస్తాన్ సైనికాధిపతి నేరుగా కలిసి, విందులు ఆరగించడం చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. అయితే, పాక్ సైన్యాధిపతి గత నాలుగైదు నెలలో వరుసగా మూడోసారి ట్రంప్‌ను కలిశారు. ఈసారి నేరుగా తమ ప్రధానిని వెంట తీసుకొచ్చారు. ఈ భేటీలు అన్ని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరగడం గమనార్హం. పాకిస్తాన్‌లో అసలైన అధికారం సైన్యంలో ఉందని గ్రహించిన ట్రంప్ నేరుగా వారితోనే సమాలోచనలు జరుపుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ ఖనిజ వనరులు పాకిస్తాన్‌లో సమృద్ధిగా ఉన్నప్పటికీ క్రూరంగా అణచివేతకు గురవుతున్న బలూచిస్తాన్ ప్రాంతానికి చెందినవి కావడం గమనార్హం. ఫోటోలు విడుదలైన వెంటనే, బలూచ్ ఉద్యమకారులు ఈ ప్రదర్శనను అపహరిస్తున్న తమ సంపదను విక్రయించడానికి ఒక నాటకీయ ప్రయత్నంగా ఖండించారు.
సోషల్ మీడియాలో తీవ్ర పోస్ట్‌లలో, బలూచ్ నాయకులు పాకిస్తాన్ తమ నేలను దోచుకుంటుందని, దానిని తనదిగా ప్రదర్శిస్తుందని, చైనాతో చేసినట్లుగా ఈ ప్రాంత వనరులను అమెరికాకు తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తోందని అంటూ ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీకి కొన్ని రోజుల ముందే బలూచ్ ప్రజల అస్తిత్వం కోసం, హక్కుల కోసం, విముక్తి కోసం పోరాడుతున్న బలూచి లిబరేషన్ ఆర్మీని, మజీద్ బ్రిగేడ్‌ను ‘విదేశీ ఉగ్ర సంస్థ’లుగా అమెరికా గుర్తించడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ భారత దేశంతో పోరాడలేమని, దాని ఫలితంగా రాబోవు రోజులలో బలూచిస్తాన్‌లో సైతం తమకు నూకలు చెల్లిపోగలవని గ్రహించిన పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అమెరికాను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నది. అందుకనే, తన జోక్యంతోనే భారత్- పాకిస్తాన్‌ల మధ్య ‘కాల్పుల విరమణ’ జరిగిందని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇస్లామాబాద్ ట్రంప్‌కు సమర్పించిన ఖనిజ ట్రే కేవలం బహుమతి కాదు. ఇది డాలర్ల కోసం అనుసరిస్తున్న ‘బిచ్చగాడి దౌత్యం’ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ బెయిలౌట్‌లు, విదేశీ సహాయాలపై ఆధారపడి ఉంది.
చైనా క్రెడిట్‌ను కోల్పోయిన తర్వాత, ఇప్పుడు అతి విలువైనదాన్ని అందించగలదని వాషింగ్టన్‌ను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ‘బిచ్చగాడి దౌత్యం’ ను అబద్ధాలపై నిర్మిస్తున్నది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ భూభాగంలో అమెరికా భారీ ఎత్తున అణ్వస్త్రాల స్థావరాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకున్నట్లు బైటపడింది. అందుకనే ‘ఉగ్రవాద దేశం’గా అంటూ వస్తున్న పాకిస్తాన్‌ను అక్కున చేర్చుకోక తప్పడం లేదు. ఇప్పుడు అరుదైన ఖనిజాల ఆశ చూపుతున్నది. ఉక్రెయిన్‌ను రష్యాకు వ్యతిరేకంగా తిప్పి, ఆ ప్రాంతంలో రావణకాష్టం మాదిరిగా యుద్ధం చెలరేగేందుకు సైతం ఆ దేశంలోనే అరుదైన ఖనిజాలపై అమెరికా దృష్టి పడటమే అని వెల్లడవుతుంది. ఉక్రెయిన్, పాకిస్తాన్ వంటి బలహీనమైన దేశాల నుండి అరుదైన ఖనిజాలను కారుచవకగా కొట్టేయాలని అమెరికా ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు అర్థం అవుతున్నది.
అరుదైన మట్టి ఖనిజాలు ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక పోటీకి కేంద్రంగా మారాయి. స్మార్ట్ ఫోన్‌లు, పునరుత్పాదక శక్తి నుండి అధునాతన ఆయుధ వ్యవస్థల వరకూ ప్రతిదానికీ కీలకమైన 17 అంశాలు ఉన్నాయి. ఈ ఖనిజాల డిమాండ్ ప్రతిరోజూ అనేక రెట్లు పెరుగుతుండగా, లభ్యత చాలా పరిమితంగా ఉంది. ప్రస్తుతం, అరుదైన ఖనిజాల కోసం ప్రపంచ ఉత్పత్తిలో చైనా సింహ భాగాన్ని నియంత్రిస్తోంది. దీనివల్ల పాశ్చాత్య దేశాలు వాటి సరఫరా గొలుసు గురించి ఆందోళన చెందుతున్నాయి. ఈ సందర్భంలోనే పాకిస్తాన్ అకస్మాత్తుగా తన నిల్వలను అమెరికాకు ప్రదర్శించాలని నిర్ణయించుకుంది.
‘పాకిస్తాన్ మైనింగ్ రంగంలో పెట్టుబడి పెట్టండి, అరుదైన ఖనిజ అయస్కాంతాలు, కోబాల్ట్, లిథియం సరఫరాలను పొందండి’ అంటూ ఆకర్షణీయమైన ప్రతిపాదనలతో పాకిస్తాన్ నాయకత్వం వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. తద్వారా తీవ్రమైన ఆర్ధిక దివాళాకోరుతనం నుండి తమ దేశాన్ని కాపాడుకోవాలని చూస్తున్నది. ట్రంప్ ఇటీవలి పదవీకాలం నెరవేరని ప్రతిష్ఠాత్మక వాగ్దానాలతో కూడా ఈ అంశం ముడిపడి ఉంది. ‘మొదటి రోజే ధరలను తగ్గిస్తానని’ ఆయన పదే పదే ప్రతిజ్ఞ చేశారు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. గుడ్లు, కిరాణా వంటి ప్రధాన వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయన విస్తృత ఆర్థిక పునరుజ్జీవనం, మౌలిక సదుపాయాల పెంపుదలకు హామీ ఇచ్చారు. కానీ విమర్శకులు ఈ చర్యలు ఎక్కువగా ప్రతీకాత్మకమైనవి లేదా ఆలస్యం అయ్యాయని వాదిస్తున్నారు.
ఆ నేపథ్యంలో బలూచిస్తాన్‌కు ఏదైనా ఖనిజ- పెట్టుబడి హామీలను లోతైన సందేహంతో చూడాలి. అయితే, నిజం ఏమిటంటే, ఈ నిక్షేపాలు ఎక్కువగా బలూచిస్తాన్ పర్వతాలు, ఎడారుల క్రింద ఉన్నాయి. పాకిస్తాన్ కింద ఉన్న ఇతర ప్రావిన్సులలో కాదు. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ బలూచిస్తాన్‌ను ఒక కాలనీగా పరిగణిస్తున్నది. అది తన వనరులను దుర్వినియోగం చేస్తూ స్థానిక జనాభాను పేదరికంలోకి నెట్టింది. ఈ ప్రాంతాలలో అమెరికా పెట్టుబడులు పెట్టడం సైతం నిప్పుతో ఆడుకోవడమే కాగలదు. చైనా సైతం వెనకడుగు వేయాల్సి వస్తుంది. బలూచిస్తాన్ నుండి విదేశీ శక్తులకు వనరులను విక్రయించడానికి పాకిస్తాన్ ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు.
సుయిలోని సహజ వాయువు క్షేత్రాల నుండి రెకో డిక్‌లోని బంగారం, రాగి నిక్షేపాల వరకు, ఇస్లామాబాద్ స్థానిక ప్రజల అనుమతి లేకుండా విదేశీ సంస్థలు, ప్రభుత్వాలతో నిరంతరం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. గతంలో, బలూచిస్తాన్‌లోని గ్వాదర్ ఓడరేవు, వనరులను పాకిస్తాన్ చైనాకు తనఖా పెట్టిందని, రుణాలకు పూచీకత్తుగా అమెరికాకు అరుదైన భూమి అయస్కాంతాలను రహస్యంగా అందించిందని వెలుగులోకి వచ్చింది. బలూచిస్తాన్ ఉద్యమకారులు దీనిని తమ మాతృభూమి ‘వేలం’ గా అభివర్ణించార. ఇస్లామాబాద్ బలూచిస్తాన్‌ను ఒక విముక్తిలేని ఆస్తిగా పరిగణిస్తున్నది. ప్రసిద్ధ బలూచ్ ఉద్యమకారుడు మీర్ యార్ బలూచ్ పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ నుండి అరుదైన మట్టిని ఎలా బలవంతంగా వెలికితీస్తుందో వెల్లడించారు. ఈ ‘అరుదైన మట్టి ఖనిజాల’ నమూనాలను పాకిస్తాన్ అవినీతిపరుడైన సైనిక అధిపతి అసిమ్ మునీర్ మీకు అందిస్తున్నారు. అక్రమ మైనింగ్ సమయంలో బలూచిస్తాన్ నుండి వీటిని దొంగిలించారు. పాకిస్తాన్ సైన్యం తుపాకీ గురిపెట్టి ఈ ఖనిజాలను అక్రమంగా వెలికి తీస్తోంది. ఇప్పుడు వాటిని పాకిస్తాన్ తమవిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగిలించిన ఆభరణాలను అప్పగించే దొంగతో పాకిస్తాన్‌ను పోల్చారు. ఇతర దేశాలలో మానవహక్కుల గురించి ముసలి కన్నీరు గార్చే అమెరికా నిజంగా మానవ హక్కులకు విలువ ఇస్తే, హింస ద్వారా అసమ్మతిని అణచివేసే ఆక్రమిత శక్తికి ప్రతిఫలమివ్వకుండా, నిజమైన యజమానులైన బలూచ్ ప్రజలతో సంబంధాలను ఏర్పరచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
చలసాని నరేంద్ర
98495 69050