గౌహతి: భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు మంగళవారం తెరలేవనుంది. గౌహతి వేదికగా మంగళవారం జరిగే తొలి వన్డేలో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. నవంబర్ రెండున జరిగే ఫైనల్‌తో మెగా టోర్నమెంట్‌కు తెరపడుతుంది. లీగ్ దశలో ప్రతి జట్టు ప్రత్యర్థి ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే తొలి నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఈ టోర్నీలో భారత్, శ్రీలంకలతో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీలో మరోసారి ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పలుసార్లు విశ్వకప్‌ను సాధించిన ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీపై కన్నేసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య టీమ్ టీమిండియా కూడా ట్రోఫీపై కన్నేసింది. సొంత గడ్డపై వరల్డ్‌కప్ జరుగుతుండడం భారత్‌కు సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. కొంత కాలంగా వన్డేల్లో టీమిండియా మహిళా అత్యంత నిలకడడైన ప్రదర్శనతో అదరగొడుతోంది. ఈ టోర్నీలోనూ మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. స్మృతి మంధాన ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటనిచ్చే అంశం. కొన్ని రోజులుగా వన్డేల్లో మంధాన వరుస సెంచరీలతో చెలరేగి పోతోంది. వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, భారత జట్లు ఫేవరెట్‌లుగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఐదున కొలంబోలో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. సౌతాఫ్రికాతో అక్టోబర్ 9న, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 12న టీమిండియా పోటీ పడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.
నేడు లంకతో తొలి పోరు
గౌహతిలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లంకతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉంది. మంధాన ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. దీనికి తోడు సొంత గడ్డపై ఆడనుండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ప్రతిక రావల్, మంధాన, హర్లిన్ డియోల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ తదితరులతో భారత్ బలంగా కనిపిస్తోంది. ఇక ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయలేం. హసిని పెరీరా, విష్మి గుణరత్నె, హర్షిత, అనుష్క, కవిష వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు లంకలో ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..