హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్’ పేరు మారింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిచేలా దీనికి ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా నామకరణం చేశారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫ్లై ఓవర్‌కి శంఖుస్థాపన చేశారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఎనిమిది సంవత్సరాల పాటు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం సాగింది. 2005లో అప్పటి పురపాలక శాఖ మంత్రి కొనేరు రంగారావు ఈ ఫ్లైఓవర్‌ని ప్రారంభించి ప్రజల వినియోగానికి అంకితం చేశారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరులో మార్పు అవసరముందని చర్చ ప్రారంభమైంది. తాజాగా జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ దీని పేరును ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.