తల్లి ట్యాబెట్స్ వేసుకోవడంలేదని కూతురు ఐరన్ రాడ్‌తో కొట్టి చంపిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లీలానగర్‌లో లక్ష్మివిలాపం(82), కూతురు మాధవి(45)తో కలిసి ఉంటోంది. లక్ష్మి విలాపం ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స చేయించుకుంటోంది. వైద్యులు రాసిన ట్యాబ్లెట్లను రోజు కూతురు ఇస్తే లక్ష్మి వేసుకునేది. కానీ రెండు రోజుల నుంచి లక్ష్మి విలాపం ట్యాబ్లెట్స్ వేసుకోవడంలేదు, దీంతో విచక్షణ కోల్పోయిన కూతురు మాధవి ఐరన్ పైప్‌తో కొడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా తల్లి ట్యాబ్లెట్స్ వేసుకోలేదని కోపంతో మాధవి ఐరన్ రాడ్‌తో కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే మాధవి అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో వచ్చిన వైద్య సిబ్బంది అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మాధవిని అరెస్టు చేశారు, కాగా మాధవి మతిస్థిమితం సరిగా లేనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.