చెన్నై: కరూర్ తొక్కిసలాటపై తమిళగ వెట్రి కజగం (టివికె) పార్టీ అధినేత విజయ్ వీడియో సందేశం విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత తొలిసారి విజయ్ తన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరూర్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. నాపై అమితమైన ప్రేమతో ప్రజలు ర్యాలీకి తరలివచ్చారు. త్వరలోనే కరూర్ వెళ్లి బాధితులను పరామర్శిస్తా. మేము ఎలాంటి తప్పు చేయకున్నా మాపై కేసు పెట్టారు. నిజం త్వరలోనే బయటపడుతుంది. ఏం జరిగిందనేది ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నా హృదయం ఆవేదనతో నిండిపోయింది. సిఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారా.? స్టాలిన్ కావాలంటే నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ, నాపై కోపం.. మా నాయకులపై చూపించవద్దు. కరూర్‌లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. నేను ఎప్పుడూ ఎవరికీ అపకారం తలపెట్టలేదు. మా నాయకులపై కేసులు ఎందుకు పెడుతున్నారు. ర్యాలీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊహించని ఘటన జరిగింది. ఇకపై మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తాం’’ అని అన్నారు.
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన విజయ్ రాజకీయ ర్యాలీకి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా.. 83 మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు ఇప్పటివరకూ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఘటనపై విచారణ పూర్తి అయ్యే వరకూ విజయ్ ఎలాంటి ర్యాలీలు చేయకుండా ఉండేందుకు ఆదేశాలు ఇవ్వాలని బాధిత కుటుంబసభ్యులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.