న్యూఢిల్లీ: 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత అప్పటి యుపిఎ ప్రభుత్వం తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ వైఖరి కారణంగా పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోకూడదని నిర్ణయించుకుందని మాజీ కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ‘ప్రతీకారి నా మనసులోకి వచ్చింది’ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంగీకరించారు. అయితే ప్రభుత్వం సైనిక చర్యకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందన్నారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడుల తర్వాత కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రిగా చిదంబరం బాధ్యతలు తీసుకున్నారు. ‘యుద్ధం చేయొద్దు’ అని ప్రపంచం మొత్తం ఢిల్లీపైకి వచ్చిందని ఆయన ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. కాగా దీనిపై బిజెపి నాయకులు ‘చాలా ఆలస్యంగా అంగీకరించారు’ అని విమర్శించారు.
‘నేను బాధ్యతలు స్వీకరించిన రెండు మూడు రోజులకే అమెరికా విదేశాంగ మంత్రి అయిన కొండోలీజా రైస్ నన్ను, ప్రధానిని కలవడానికి విమానంలో వచ్చారు. అది కూడా ‘దయచేసి స్పందించొద్దు’ అని చెప్పడానికి. ‘ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం’ అని నేను ఆమెకు తెలిపాను. ఎటువంటి అధికారిక రహస్యాన్ని తెలుపకుండా, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన నా మనసులో వచ్చింది’ అని ఆయన అంగీకరించారు. 2008 నవంబర్ 26న లష్కరే తోయిబాతో అనుబంధం ఉన్న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదుల బృందం ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్‌లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించింది. ముంబై పోలీసులు అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నారు. తర్వాత అతడిని 2012లో ఉరితీశారన్నది తెలిసిన విషయమే.