ఖాట్మండు: తమ మధ్యంతర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం సకాలంలోనే సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉందని నేపాల్ ప్రధాని సుశీలా కర్కి వెల్లడించారు. నేపాల్‌లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో విజయదశమి ఒకటి. బడాదషైన్ అని ఈ పండగను పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రధాని కర్కిల్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ షెడ్యూల్ తేదీకే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రజలు ప్రశాంతతను పాటించాలని, ప్రభుత్వం, పార్లమెంట్ కొనసాగేలా మద్దతు ఇవ్వాలని తన సందేశంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారం వల్లనే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందని, ప్రస్తుత పరిస్థితి నుంచి త్వరగా ఊరట లభిస్తుందని సూచించారు. దేశ సంక్షేమం కోసం అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు.
దేశం శాంతి సుస్థిరత, చక్కని పాలన, పురోభివృద్ధిగా ముందుకు సాగాలని , దుర్గామాత ఈమేకు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 23న ప్రధాని కర్కి దేశాధ్యక్షుడు పౌడెల్‌తో భేటీ అయ్యారు. సకాలంలో సాధారణ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశం తరువాత ఓటర్ల నమోదు చట్ట సవరణ ఆర్డినెన్సు జారీ చేశారు. దీనివల్ల 2026 మార్చిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందుగా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం 1,81,68,000 మంది అర్హులైన ఓటర్లు నేపాల్‌లో ఉన్నారు.