వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌ను 24 క్యారెట్ల బంగారం తాపడాలతో అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా శ్వేతసౌధం లోని ఓవల్ ఆఫీస్ క్యాబినెట్ రూమ్‌లో భారీగా స్వర్ణ అలంకరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అందమైన భవనంగా పేరుపొందిన శ్వేతసౌధం ఇకపై అత్యుత్తమమైన భవనంగా ఇక్కడికి వచ్చిన విదేశీ నేతలను విస్తుపోయేలా చేస్తుందని తెలిపారు. కార్యాలయంలో అలంకరిస్తున్న మేలిమి అలంకరణల నాణ్యత, సౌందర్యం చూసి ఏ విదేశీ నాయకుడైనా ఆశ్చర్యపోవాలన్నారు.
శ్వేతసౌధంలో ఏర్పాటు చేయనున్న స్వర్ణ అలంకరణలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో బంగారు పూతతో ఉన్న డజన్ల కొద్దీ డిజైన్లు కనిపిస్తున్నాయి. వైట్‌హౌస్‌లో స్వర్ణతాపడాలు చేయించడానికి ఉపయోగించిన బంగారం ఖర్చును ట్రంప్‌నే స్వయంగా భరించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి ఇటీవల పేర్కొన్నారు. అయితే ఎంతమొత్తంలో బంగారాన్ని వినియోగిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే ఓవల్ ఆఫీస్‌లో పలు చోట్ల స్వర్ణ తాపడాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా బంగారంతో అలంకరించాలనే తన కోరికను ట్రంప్ పలుమార్లు బయటపెట్టారు.