రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాబట్టే పంజా విసిరారని, రేవంత్ పంజాకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబం నిలబడలేదని, సిఎం రేవంత్ రెడ్డి పులి పంజా విసిరితే బిఆర్‌ఎస్ గద్దె దిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళ్ల ఎదుట రేవంత్‌రెడ్డి కనబడుతుంటే ఇంకా కెటిఆర్ కబోదిగా మాట్లాడితే ఎలా అని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం అచ్చంపేటలో మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. పాలమూరు రంగారెడ్డిపై కెటిఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని మంత్రి పేర్కొన్నారు. మంత్రి జూపల్లి సోమవారం మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కెటిఆర్ అయినా హరీష్ రావులు చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే మీరు రాజీనామా చేస్తారా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో అని తాను అన్నట్లు వారిద్దరూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. తాను ఏం మాట్లాడానో పూర్తి వీడియో చూస్తే తెలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కెటిఆర్ చర్చకు వస్తే పూర్తి వీడియో చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు రూ.8 లక్షల కోట్లు బాకీ ఉందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్, 200 యూనిట్ల విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లాంటి ఆనేక సంక్షేమ పథకాలు అందించామని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ పాలన కేవలం రెండేళ్ల అవుతోంది కదా వరుసగా ఒక్కో హామీ పూర్తి చేసుకుంటూ వస్తున్నామని, అన్ని హామీలు అమలు చేస్తామని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు. కానీ, బిఆర్‌ఎస్ పదేళ్లు పాలన చేసి లక్షల కోట్లు అప్పులు చేసి ఆదాయం వచ్చినా చెప్పిన హామీలు అమలు చేయలేని మంత్రి ఆరోపించారు. స్థానిక పోరులో ఎవరి బలం ఏమిటో తేలిపోతుందని జూపల్లి స్పష్టం చేశారు.