అరవై సంవత్సరాల సాహిత్య జీవితంలో అనేకనవలలు, తత్త్వశాస్త్ర రచనలు రాసిన ప్రముఖ కన్నడ నవలా రచయిత, తత్త్వవేత్త ఎస్.ఎల్ భైరప్ప 2025 సెప్టెంబర్ 24న బెంగళూరులో గుండెపోటుతో 94ఏళ్ల వయస్సులో మరణించారు. ఆయన హాసన్ జిల్లాలోని సంతేశివర గ్రామం లో 1931 ఆగస్టు 20న జన్మించారు. తన తాత్వి కనవలల ద్వారా భారతీయ సంస్కృతిని చిరస్థాయిగా నిలిపిన సాహితీవేత్త. ఆయన రచనలు భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలలోకి అనువదించబడ్డాయి. ఆంగ్లంలోకి అనువదించబడిన నవలలు ఆయనను ప్రపంచస్థాయికి తీసుకెళ్లా యి. ఎస్.ఎల్.భైరప్పగొప్ప నవలా రచయితే గాక విద్యావేత్త, గొప్ప చింతనాపరుడు.
ఎస్.ఎల్ భైరప్ప సాహిత్య శైలి ప్రత్యేకమైన వస్తు వు, నిర్మాణం, పాత్రల చిత్రణతో కూడి ఉంటుం ది. ఆయన రచనలు తత్త్వశాస్త్రం, చరిత్ర, సౌందర్యశాస్త్రం, వంటి అంశాలను లోతుగా అన్వేషిస్తా యి. పురాతన భారతీయ తత్త్వసంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ‘పర్వ’ నవల మహాభారతాన్ని సామాజిక, మానవశాస్త్ర దృక్కోణాల నుండి పునర్నిర్మిస్తుంది. భైరప్ప రచనల్లోని నిర్మాణం కథనాన్ని, తాత్విక పరిశోధనతో మేళవిస్తుంది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నుండి ప్రభావితమైన రాగ విస్తరణ వంటి వ్యవస్థాగత విధానాన్ని అనుసరిస్తుంది. ఆయన శైలి మేధో సాంద్రత, తాత్విక లోతుతో కూడి ఉండి సాంప్రదాయిక దృక్పథాన్ని కలిగి ఆధునికతతో సంఘర్షణలను చర్చిస్తుంది. ఈ శైలి అయన భావాలు అనేక వివాదాలకు కూడా కారణమయ్యాయి. భైరప్ప ఏ సాహిత్య ఉద్యమానికి చెందినవాడు కాదని, స్వంత మార్గాన్ని అనుసరిస్తాడని కొందరు విమర్శకుల అభిప్రాయం.
ఎస్.ఎల్ భైరప్ప ఇంటర్మీడియట్ చదువుతున్నప్పు డే రాయడం ప్రారంభించాడు. ఆయన 1958లో భీమకాయతో మొదలుపెట్టి, ఐదు దశాబ్దాలకు పైగా 24నవలలు రాశారు. ఆయన నవలలు వంశవృక్ష, తబ్బలియు నీనాడే మగనే, మతదాన, నాయి నెరలు వంటి నవలలు సినిమాలుగా తీయబడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ‘వంశవృక్ష’ నవలను సింధువల్లి అనంతమూర్తి కన్నడ రంగస్థల నాటకంగా, ‘మంద్ర’ నాటకాన్ని డాక్టర్ బి.వి.రాజారామ్, రామ్‌నాథ్‌లు విడివిడిగా రంగస్థలానికి అనుకరించారు. ప్రఖ్యాత నృత్యకారిణి తులసి రామచంద్ర ‘సార్థ’ నవలను నృత్య నాటకంగా ప్రదర్శించారు.
భైరప్ప నవల ‘గృహ భంగా’ గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో సీరియల్‌గా ప్రసారం అయి, ఎంతో ప్రజాదరణ పొందింది. మరో నవల ‘దాటు’ బసు ఛటర్జీ దర్శకత్వంలో ‘ఉల్లంఘన్’ పేరుతో హిందీ సీరియల్‌గా ప్రసారం అయింది. ‘భిత్తి’ నవల అతడి ఆత్మకథ అని చెప్పవచ్చు. ఈ నవల ద్వారా ఎస్.ఎల్.భైరప్ప బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కష్టాలు ఆయన జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. హాసన్ జిల్లాలోని సంతేశివర గ్రామం లో హోయ్సల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన, తన చిన్నతనంలోనే ప్లేగు వ్యాధి కారణంగా తల్లిని, సోదరులను కోల్పోయా రు. ఈ విషాదం ఆయన జీవితంలో ఆర్థిక, భావోద్వేగ సవాళ్లను తెచ్చిపెట్టింది. చదువుకోడానికి డబ్బు సమకూర్చుకొనే క్రమంలో ఆయన చిన్న చిన్న పనులు చేశారు. ముంబైలో రైల్వే కూలీగా పనిచేశారు. తన బంధువు సలహాతో ఉన్నత పాఠశాల విద్యను మధ్యలో ఆపేసి, జ్ఞాన సంపాదన కోసం ఒక సంవత్సరం పాటు ఊరూరు తిరిగా రు. ఈ సమయంలో ముంబైలో సాధువుల బృం దంతో కలిసి ఆధ్యాత్మిక ఓదార్పు కోసం ప్రయాణించారు. ఈ అనుభవాలు ఆయనకు గ్రామీణ, పట్టణ జీవన విధానాలను దగ్గరగా చూసే అవకాశం ఇచ్చాయి. తర్వాత ఆయన సాహిత్యంలో లోతైన పాత్రల చిత్రణకు దోహదపడ్డాయి.
ఎస్.ఎల్.భైరప్ప నేపథ్యం ఆయనకు జీవితపు లోతులు, వైరుధ్యాలు అర్థం చేసుకోవడానికి, తా త్విక చింతనను రచనల్లో పొందుపరచడానికి దోహదపడింది. ఆయన బాల్యంలోనే తల్లి, సోదరులు, సోదరి మరణాలు అనివార్యతను, జీవిత పు దుర్భరతను లోతుగా అనుభవించేలా చేశా యి. ఇది ‘పర్వ’, ‘నెలె’ వంటి రచనల్లో మరణ మిస్టరీని తాత్వికంగా అన్వేషించడానికి పునాది వేసింది. ఆర్థిక కష్టాల కారణంగా చిన్న వయస్సులోనే రైల్వే పోర్టర్ వంటి ఉద్యోగాలు చేయడం, గ్రామీణ-, పట్టణ జీవన విధానాలను దగ్గరగా పరిశీలించడం ఆయనకు మానవ సంబంధాలు, (మానవ భావోద్వేగ సంబంధాలు), ‘గృహభంగ’ (వివాహేతర సంబంధాలు) వంటి నవలల్లో ప్రతిబింబిస్తుంది. ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ లభించకపోవడంతో ఆత్మహత్య ఆలోచనలు చేసిన సమయంలో వర్షం యొక్క సహజ దృగ్విషయం (ఆవిరి, మేఘాలు, వర్షం) ఆయనను ఆకర్షించి జీవితాన్ని కాపాడిన అనుభవం అతడికి ప్రకృతి రహస్యాలపట్ల ఆసక్తిని పెంచి, ‘వంశవృక్ష’ (వర్షం మానసిక స్థితులు), ‘పర్వ’ (ప్రళయ సింబాల్) వంటి రచనల్లో ఆ విషయాలు ప్రతిఫలించాయి. విద్యాభ్యాసంలో ఫిలాసఫీలో బిఏ ఆనర్స్, ఎంఏ (గోల్ మెడల్), పి.హెచ్.డి. (‘సత్య మరియు సౌం దర్యం’) పూర్తి చేయడం భారతీయ, పాశ్చాత్య తత్త్వశాస్త్రాలలో లోతైన జ్ఞానాన్ని అందించి, ’పర్వ’లో మహాభారతాన్ని సామాజిక- మానవశాస్త్ర దృక్కోణాల నుండి పునర్నిర్మాణం చేయడంవంటి తాత్విక అన్వేషణలకు దారితీసింది.
ప్రపంచ పర్యటనలు (హిమాలయాలు, ఆల్ఫ్, ఆండీస్, అమెరికా, యూరప్), సాధువులతో ప్రయాణాలు ఆయనకు సాంస్కృతిక వైవిధ్యాలు, చారిత్రక వైరుధ్యాలు అర్థం చేసుకునేందుకు సహాయపడ్డాయి. ’ఆవరణ’లో ఇస్లామిక్ పాలన ప్రభావాన్ని వివాదాస్పదంగా చర్చించడం, ‘యాన’లో అంతరిక్ష ప్రయాణాన్ని తాత్వికంగా చిత్రించడం వంటివి చదువరులను ఆకట్టుకొన్నాయి. ఆయన ఆత్మకథ ‘భిత్తి’లో వ్యక్తిగత- బౌద్ధిక చర్చలు, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం (గంగూబాయి హంగల్ కచేరీ) ప్రభావం వంటివి ‘మంద్ర’లో మానవ భావోద్వేగాలను సంగీత దృక్కోణంతో అన్వేషించడానికి దోహదపడ్డాయి.
భైరప్ప గారు అనేక అవార్డులు అందుకున్నారు. 2010లో మంద్ర నవలకు 20వ సరస్వతి సమ్మా న్, మార్చి 2015లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, 2016లో పద్మశ్రీ, 2023లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు ‘వంశవృక్ష’కు 1966లో కన్నడ సాహిత్య అకాడమీ అవా ర్డు, ‘దాటు’కు 1975లో కన్నడ అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, 2020లో బెండ్రే నేషనల్ అవార్డు, నృపతుంగ అవార్డు మొదలైనవి వచ్చాయి. తాను సరైనది అని భావించిన దానిని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తీకరించి అనేక మంది అభిమానానికి, విమర్శలకు ఆయన గురయ్యారు.
ఎస్.ఎల్.భైరప్ప తెలుగు పాఠకులకు తన రచనల ద్వారా లోతైన తాత్విక, చారిత్రక, సామాజిక అంశాలను అందించడం వల్ల దగ్గరయ్యాడు. ఆయన నవలలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాలను తెలుగు పాఠకు ల సాంస్కృతిక నేపథ్యంతో సమన్వయం చేస్తా యి. ‘గృహభంగ’ వంటి నవలలు గ్రామీణ జీవ నం, కుటుంబ సంబంధాల వైరుధ్యాలను చిత్రించడం ద్వారా తెలుగు పాఠకుల హృదయాలను ఆకర్షించాయి. ‘పర్వ’, ‘వంశవృక్ష’, ‘ఆవరణ’, భారతీయ తత్త్వశాస్త్రం, చరిత్ర, సామాజిక నీతిని లోతుగా అన్వేసహించడం వల్ల తెలుగు పాఠకులకు సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన అంశాలుగా ఆకర్షణీయంగా కనిపించాయి. భైరప్ప నవలలు ‘పర్వ’, ‘వంశవృక్ష’, ‘ఆవరణ’, ‘దాటు’ ‘గృహభంగ వంటివి తెలుగులో అను వదించబడం వలన తెలుగు పాఠకులకు సులభంగా అందుబాటులో ఉండటమే కాక, ఆ యన తాత్విక చింతనను స్థానిక భాషలో అనుభవించే అవకాశం కల్పించాయి.
తెలుగు సమాజంలో కూడా కుటుంబం, సంగీ తం, సామాజిక విలువలు ముఖ్యమైనవి కావడం మూలంగా ‘తంతు’లో మానవ భావోద్వేగ సం బంధాలు, ‘మంద్ర’లో సంగీతం ద్వారా జీవన రాగాల చిత్రణ వంటివి తెలుగు పాఠకులకు సాంస్కృతికంగా సన్నిహితమైన అనుభవాలు అందించాయి. మొత్తంగా, భైరప్ప రచనలు తెలుగు పాఠకులకు సాంస్కృతిక సమానత్వం, తాత్విక లోతు, మానవీయ అనుభవాల ద్వారా దగ్గరయ్యాయి. ఆయన నవలలు తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించాయి. తెలుగు పాఠకుల హృదయాల్లో ఆయన రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. భైరప్ప గారి మరణం కన్నడ, తెలుగు సాహిత్య లోకానికే కాదు యావత్ ప్రపంచ సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. సాహిత్య లోకానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. ఎస్.ఎల్. బైరప్పకు నివాళి.
– మారుతి పౌరోహితం