హైదరాబాద్: టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసి జరుగుతోందని సిపి. సివి ఆనంద్ తెలిపారు. పైరసి వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ముఠా పైరసీ వల్ల తెలుగుచిత్ర పరిశ్రమకు రూ. 3700 కోట్ల మేర నష్టం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్తగా ఎంవొ అనే విధానంలోనూ పైరసి జరుగుతోందని, థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విస్తుపోయేలా డిజిటల్ శాటిలైన్ ను కూడా హ్యాక్ చేసి పైరసి చేస్తున్నారన్నారు.
పైరసి మూవీలు అప్ లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని, సింగిల్, హాట్ సినిమాల పైరసి జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని ఆనంద్ తెలియజేశారు. పైరసి కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మరొకరికి పంపించాడని అన్నారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ తో సినిమాను రికార్డింగ్ చేస్తారని, కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాలను పైరసి చేశారని చెప్పారు.
ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాను థియేటర్ లో రికార్డింగ్ చేశారని, సెల్ ఫోన్లను జేబులోగాని, పాప్ కార్న్ డబ్బాలో గానీ పెడతారని అన్నారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉంటుందని, మొబైల్ స్క్రీన్ లైట్ ఆఫ్ లో ఉండటంతో ఎవరికి అనుమానం రాదని చెప్పారు. ఇతర భాష చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని, సినిమా పైరసిలకు నెదర్లాండ్ కు చెందిన ఐపి అడ్రస్ వాడుతున్నారని పేర్కొన్నారు. పైరసి ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించామని, పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని నిందితులు భావించారని సివి ఆనంద్ స్పష్టం చేశారు.