వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన దృష్టి సినిమాలపై పడింది. అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తామని పేర్కొన్నారు. చిన్న పిల్లల నుంచి క్యాండీని లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని లాక్కున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా అకౌంట్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.
‘‘అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించబోతున్నాం. మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయి. పిల్లాడి నుంచి క్యాండీని దొంగిలించినట్లు మా వద్ద నుంచి ఇతర దేశాలు లాక్కున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాకు ఉన్న అసమర్థ, బలహీన గవర్నర్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను 100 శాతం సుంకం విధించడం ద్వారా పరిష్కరించి అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాను’’ అని ట్రూత్‌లో ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ సుంకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని వెల్లడించలేదు.