* ఆల్మట్టి ఎత్తు పెంపు పై సుప్రీంకోర్టులో పోరాటం
* డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రజాహిత చేవెళ్ల-ప్రాణహిత డిపిఆర్ లు సిద్ధం చేయండి
* మంత్రివర్గ ఆమోదంతో ఎస్‌ఎల్‌బిసి పనుల పునరుద్ధరణ
* సాగునీటి చెరువుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
* సాగునీటి సంఘాల ఏర్పాటుకు సమాలోచనలు
* చిన్న సాగునీటి చెరువులు,కుంటలు,కాలువల భద్రతకు చర్యలు
* రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యుల సమన్వయంతో సంఘాల ఏర్పాటుకు ప్రణాళికలు
-* రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రాజెక్టులపై కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ ఆలమట్టి ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్స్ సోమవారం చిటాచాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆల్మట్టి ఎత్తు పెంచవద్దని సుప్రీంకోర్ట్ స్టే ఉందని, ఆల్మట్టి ఎత్తు పెంపుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని వెల్లడించారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయ వాది వైద్యనాథన్ ను నియమించామని చెప్పారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలో కాంగ్రెస్ హయంలోనే తెలంగాణకు న్యాయం జరిగిందని వెల్లడించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయమే జరిగిందని ఆరోపించారు. తెలంగాణా ప్రాంతంలో సాగునీటి చెరువులు,కుంటలు,కాలువల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర నీటిపారుదల, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానుసారం సాగునీటి సంఘాల ఏర్పాటు పై
సమాలోచనలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా సంభవించిన వర్షాలు ఉధృతికి చిన్న నీటిపారుదల శాఖా పరిధిలోని చెరువులు,కుంటలకు గండ్లు పడడం,కాలువలు తెగి పోవడం వంటి అంశాలతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడం, సీతారామ, చనకా -కొరటా, సీతమ్మ సాగర్, మోడీకుంట వాగు అనుమతులతో పాటు ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ పై సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చెరువులు,కుంటలు, కాలువల భద్రత కోసం అన్ని విధాలుగా అధ్యయనం చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్ట పోవద్దన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా రైతాంగ ప్రయోజనాలను కాపాడడంతో పాటు సాగునీటి అంశంలో ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా సాగునీటి సంఘాల ఏర్పాటును పరిశీలనలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖా సలహాదారుడు అదిత్యా నాధ్ దాస్,ఇ.ఎన్.సి లు అంజద్ హుస్సేన్,శ్రీనివాస్, రమేష్ బాబుతో పాటు సి.ఇలు అజయ్ కుమార్,మధుసూదన్ రెడ్డి,శ్రీనివాస్, పి.వి నాగేందర్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి సంఘాల ఏర్పాటయ్యేలా చూడాలి : స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సాగునీటి సంఘాల ఏర్పాటయ్యేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్న, సాగునీటి చెరువుల పరిరక్షణ నిమిత్తం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసిన పక్షంలో క్రమ క్రమంగా భారీ నీటి తరహా ప్రాజెక్టులకు విస్తరించేందుకు దోహద పడుతుందన్నారు. సాగునీటి సంఘంతో లష్కర్ తో పాటు సిబ్బంది, నీటిపారుదల శాఖా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం సమన్వయం చేసుకుని పని చేసేలా సమన్వయం చేయగలిగితే సత్ఫాలితాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఈ సంఘాలకు సంబంధిత డిప్యూటీ ఇంజినీర్ కన్వీనర్ గా వ్యవరించేలా విధి విధానాలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 1997 నాటి నీటివనరుల అభివృద్ధి సంస్థ రూపొందించిన చట్టం ప్రకారమే సాగునీటి సంఘాలకు కాలువల నిర్వహణ,నీటి పంపిణీ ,చెరువుల పరిరక్షణ బాధ్యత ఉంటుందని, నిబంధనలకు అనుగుణంగా సాగునీటి సంఘాలకు చట్టపరమైన, పాలనాపరమైన తోడ్పాటు ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. 2018 -19లో నీటి సెస్సు రద్దు చేసిన మీదట సాగునీటి సంఘాలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో తాజాగా సంభవించిన వర్షపు ఉధృతికి చిన్న నీటిపారుదల చెరువులు,కుంటలు,కాలువలు దెబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా సాగునీటి చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురై పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో రైతులు వర్షాకాలంలో భారీగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మీదట చెరువులు,కుంటలు,కాలువల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి సాగునీటి సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో సాగునీటి నిర్వహణ తోపాటు చెరువులు, కుంటలు, కాలువలకు భద్రత కలిపించే చర్యలు సాగునీటి సంఘాలకు బాధ్యత ఉండేలా చర్యలు ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం కోసం తెలంగాణా అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫెర్ కమిషన్ చైర్మన్ యం.కోదండ రెడ్డి, కమిషన్ సభ్యుల సమన్వయం తో సాగునీటి సంఘాలను నామినేట్ చేసే విదంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ మేరకు కమిషన్ చైర్మన్ యం.కోదండ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చిన్న సాగునీటి చెరువులు నిర్లక్ష్యానికి గురవడంతో పాటు వర్షాలకు చెరువులకు గండ్లు పడి రైతాంగం నష్ట పోతున్న అంశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది కి నివేదిక రూపంలో అందించారు.అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వీలుగా సాగునీటి సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఆ బృందం వివరించింది. మానవ వనరులతో పాటు లష్కర్, సిబ్బంది, ఆర్థిక వనరులతో సాగునీటి సంఘాలను బలోపేతం చేయడం వంటి అంశాలతో కమిషన్ ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా రూపొందించిన అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సిఫారసు చేశారు.
చట్టపరమైన పోరాటానికి సిద్ధం కావాలి : కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంపుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటానికి సిద్ధం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనుమతులు పెండింగ్ లో ఉన్న సీతారామ,చనకా-కొరటా,సీతమ్మ సాగర్,మోడీకుంట వాగు వంటి ప్రాజెక్టుల అనుమతులను త్వరితగతిన తీసుకునేలా పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. అలాగే తమ్మిడిహట్టి వద్ద నిర్మించ తల పెట్టిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు సంబందించిన డిపిఆర్ లను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. మంత్రివర్గ ఆమోదం పొందిన మీదట ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల ప్యాకేజి -6 తదితర ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలు మంత్రివర్గ ఆమోదం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.