లద్దాఖ్ -2019లో జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి, ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం అయిన ప్రదేశం. ఈ మధ్య లద్దాఖ్‌లో హింసాకాండ, నలుగురు యువ నిరసన కారుల మృతి, ఈ ప్రాంతంలో అత్యంత రక్తం చిందిన రోజుగా నిలిచింది. విద్యార్థులు, జనరల్ జెడ్ కార్యకర్తల నేతృత్వంలో శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం ప్రధాన, శక్తివంతమైన డిమాండ్
ప్రత్యేక రాష్ట్రం హోదా లేదా ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణలు. నెలల తరబడి లద్దాఖ్ వాసులు – బౌద్ధులు, ముస్లింలు తమ భూమి, ఉద్యోగాలు, తమ ప్రత్యేక సాంసృ్కతిక గుర్తింపు కోసం ఐక్యంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఉదాసీనత వైఖరి చూపింది, అత్యంత దారుణంగా అణచివేసేందుకు సిద్ధమైంది. సోనమ్ వాంగ్ చుక్ వంటి ప్రముఖుల గొంతు నొక్కే ప్రయత్నం, అరెస్ట్‌లు, అతడి సంస్థలకు నిధులను స్తంభింపజేయడం, పాకిస్తాన్‌లో జరిగే అంతర్జాతీయ సమావేశాలకు అనుమతించడంలో జాప్యం వంటి చర్యల ద్వారా లద్దాఖ్‌ను భారత యూనియన్‌లో భాగంగా కాకుండా, వారి డిమాండ్ అణచివేసే చర్యలనే అభిప్రాయాన్ని పెంచుతోంది. భారత రాజ్యాంగంలో భాగమే ఆరవ షెడ్యూల్. 1952 లో రాజ్యాంగం ఆమోదించిన ఈ షెడ్యూల్ ఈశాన్యంలోని గిరిజన, స్వదేశీ వర్గాలహక్కులను కాపాడేందుకు రూపొందించారు. ఆరవ షెడ్యూల్ కొన్ని ప్రదేశాలలో భూమి, అడవులు, సంసృ్కతుల పరిరక్షణకు స్థానిక పాలనపై శాసనపరమైన, న్యాయ కార్యనిర్వహణ అధికారాలతో కూడిన అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ (ఎడిసిలు) ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. ఈ కౌన్సిళ్లు ప్రత్యక్షంగా ఎన్నికై గవర్నర్ కింద పనిచేస్తాయి. కానీ, అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవడానికి, భూయాజమాన్య హక్కుల నియంత్రణ, సంస్కృతి పరిరక్షణకు వాటికి గణనీయమైన స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆరవ షెడ్యూల్ భారత యూనియన్‌లో కమ్యూనిటీలు తమను తాము పాలించుకోవడానికి అనుమతినిస్తుంది. ఇవి వేర్పాటువాద ఏర్పాటు కాకుండా, భారత రాజ్యాంగం నుంచి రక్షణ కల్పిస్తుంది. పరాయి వారమన్న భావన పోగొట్టి, అత్యంత సున్నితమైన ప్రాంతాలలో శాంతిని పెంపొందించేందుకు చేసిన ఏర్పాటు.
లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం కావడం. అటు చైనా, ఇటు పాకిస్తాన్ రెండింటికీ సరిహద్దులో ఉండడం, ఆ ప్రదేశానికి స్వయం ప్రతిపత్తి ఇస్తే ప్రమాదకరంగా మారుతుందన్న భావనే లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చే విషయంలో కేంద్రం సంశయించడానికి కారణం. ఈశాన్య భారతంలో పరిణామాలను చూసినప్పుడు ఆ వాదన తప్పని తేలిపోతుంది. అసోంలో ఇప్పటికే ఆరవ షెడ్యూల్ కింద ఇప్పటికే మూడు స్వయం ప్రతిపత్తి జిల్లా మండళ్లు పని చేస్తున్నాయి. దశాబ్దాలపాటు హింసాత్మక తిరుగుబాటు సాగిన పశ్చిమ అసోంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (బిటీఆర్) ఇప్పుడు భూమి, సంస్కృతి, అభివృద్ధిపై దాని, స్వంత శాసనసభ, పరిపాలనతో నడుస్తోంది. వేర్పాటు వాదన వీడి భారత యూనియన్‌లో ప్రజాస్వామ్య సంస్థగా మారేందుకు కౌన్సిల్ సహాయపడింది. కర్బి తెగలకు ప్రాతినిధ్యం వహించే కర్బి ఆంగ్లోస్ అటానమస్ కౌన్సిల్ (కెఎఎసి) స్థానిక వనరులు, సంస్కృతి, పాలనను సజావుగా నిర్వహిస్తోంది. ఒకప్పుడు అశాంతితో చెలరేగిన కర్బి ప్రజలకు కౌన్సిల్ భారత రాజ్యాంగ చట్రంలో ఇమిడిపోయింది.
ఇక దిమాసా- మెజారిటీ కొండ జిల్లాను పాలించే దిమా హసావో అటానమస్ కౌన్సిల్ (డిహెచ్‌ఎసి) సున్నిత సరిహద్దు ప్రాంతంలో తమ జాతి ఆకాంక్షలను పరిష్కరించుకుంటూ స్థిరమైన పాత్ర పోషిస్తోంది. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో తమ జాతి ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఈ మండళ్లు బంగ్లాదేశ్‌తో విస్తృతమైన సరిహద్దు ప్రాంతాలను పంచుకునే రాష్ట్రంలోనే ఉన్నాయి. వలసలు, తిరుగుబాటు, సరిహద్దు ఉద్రిక్తతల చరిత్రగల ఈ ప్రాంతాలు భారత సార్వభౌమాధికారానికి సవాల్‌గా నిలవలేదు. అందుకు విరుద్ధంగా అవి తమ డిమాండ్లను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కారించుకునే యత్నంలో ఉన్నాయి. ఇక మేఘాలయలోని ఖాసీ, జైంటియా హిల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిళ్లు గిరిజన సంస్థలకు అధికారం ఇవ్వడం ద్వారా తమ గుర్తింపును కాపాడుకుంటున్నాయి. త్రిపురలో త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలి (టిటిఎఎడిసి) రాష్ట్రంలోని దాదాపు 70 శాతం భూమిని నియంత్రిస్తుంది. జాతిపరమైన ఉద్రిక్తతలను తగ్గిస్తున్నది. మిజోరాంలోని లుషియ్ హిల్ జిల్లా కౌన్సిల్ 1986 మిజో ఒప్పందం ద్వారా ఏర్పడింది. దేశంలో అత్యంత హింసాత్మకంగా సాగిన తిరుగుబాటునుంచి ఈ ప్రాంతం శాంతికి ప్రతీకగా నిలిచింది. అస్థిర చరిత్రలు, అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలకు ఆరవ షెడ్యూల్ రక్షణలు కల్పించిన కేంద్రం, లద్దాఖ్‌ను భిన్నంగా ఎందుకు చూడాలన్నదే ప్రశ్న.
మణిపూర్‌లోని కొండ జిల్లాల ప్రజలు ఎక్కువగా గిరిజనులే. వారు చాలా కాలంగా ఆరవ షెడ్యూల్ హోదా డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ లద్దాఖ్ డిమాండ్ ఒక్కటే, తమ వనరులపై స్థానిక నియంత్రణ, సాంసృ్కతిక గుర్తింపు కోసమే రక్షించుకునే పోరాటం. అయినా, కేంద్రం అడ్డుకుంటోంది, తిరస్కరిస్తోంది. ఈశాన్య రాష్ట్రం కానీ, లద్దాఖ్ కానీ సున్నితమైన సరిహద్దు ప్రాంతాలలోని స్థానిక వర్గాలకు అధికారాన్ని ఇచ్చేందుకు కేంద్ర సిద్ధంగా లేదు. ఈ తిరస్కరణ హ్రస్వ దృష్టితో కూడినది అని చరిత్ర రుజువు చేస్తోంది. స్వతంత్ర ప్రతిపత్తి విస్తరించిన చోట శాంతి నెలకొన్నది. అది కాదన్నచోట అశాంతి హెచ్చింది. విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ పట్ల మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం. అతనితో చర్చలు జరపడానికి బదులు, ప్రభుత్వం అతన్ని శిక్షించేందుకే నిర్ణయించింది. అరెస్ట్ చేయడం, ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, పాకిస్తాన్‌లో పాల్గొన్న కార్యక్రమంపై అనుమానించడం వంటి చర్యలకు సిద్ధమైంది. ఇది రాజకీయ ప్రతీకార చర్య. వాంగ్ చుక్ భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలకు దిగలేదు. లద్దాఖ్‌లోని సున్నితమైన పర్యావరణానికి స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంతోపాటు శాంతియుత ప్రజాస్వామ్య డిమాండ్‌కే అంకితమయ్యాడు. అతడి చర్యలను నేరంగా పరిగణించడం, అతడిపై దాడి మాత్రమే కాదు. లద్దాఖ్ పౌర సమాజం, అసమ్మతి హక్కుపై దాడి చేయడమే.
ఈ ఉద్యమాన్ని గొప్పగా చేసింది లద్దాఖ్ లోని జెన్ జెడ్ నాయకత్వం. యువకులు, మహిళలు, విద్యార్థులతో కూడిన ఈ బృందం ఇంటర్ నెట్ సాయంతో ప్రపంచం పట్ల అవగాహన పెంచుకుని, లోతైన పర్యావరణ స్పృహ తో ఎదిగారు. వారు ఆరవ షెడ్యూల్ డిమాండ్‌కు ప్రధాన కారణం పూర్వీకుల భూమి రక్షించడమే కాదు, వాతావరణ మార్పు, సైనికీకరణ నేపథ్యంలో స్థిరమైన భవిష్యత్ ఏర్పాటు చేసుకోవడం. ఉద్యమంలో నలుగురు సహచరుల బలిదానం, జరిగిన హింసాకాండ, వారి నోళ్లు నొక్కేయదు. ఉద్యమానికి కొత్తశక్తిని, నైతిక సామర్థ్యాన్ని ఇచ్చింది. భారత సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే తాము యత్నిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.అయితే, రాజ్యాంగ పరిధిలో పౌరులు తమను తాము పాలించుకున్నప్పుడు సార్వభౌమాధికారం బలహీనపడదు. ఇక్కడ అసలు సమస్య కేంద్రీకరణ 2019 ఆగస్టులో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత నుంచి దానిని కేంద్రం యూనియన్‌లో భాగంగా కాక, దేశానికి ఔట్ పోస్ట్‌గా భావిస్తోందన్న భావన కన్పిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలు ఇందుకు భిన్నమైన పాఠాలు నేర్పుతాయి. భారతదేశం తన సరిహద్దు సమాజాలకు స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడు విధేయతతో ప్రతిస్పందించారు. కేంద్రం ఆ ప్రాంతాలను విశ్వసించనప్పుడే, అశాంతి చెలరేగింది. లద్దాఖ్‌లో హింసాకాండ, మరణాలు మేలుకొలుపు వంటిది. అణచివేతకు బదులు, మోడీ సర్కార్ విద్యార్థులతోనూ, మతనాయకులు, పౌరసమాజం, సోనమ్ వాంగ్ చుక్‌తో సంప్రదింపులు చేపట్టాలి. ఆరవ షెడ్యూల్ హోదా మంజూరు చేయడమో, కనీసం చక్కటి పారదర్శికంతో కూడిన పరిష్కారం వల్ల ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. లద్దాఖ్ రాజ్యాంగపరమైన హక్కులను తిరస్కరించడం భారతదేశ సార్వభౌమత్వాన్ని బలోపేతం చేయదు. తీవ్ర అస్థిత్వతకు దారితీస్తుంది. మంచు కొండల్లో చిందిన రక్తం ప్రజాస్వామ్య ఆకాంక్షలను బలవంతంగా అణచివేయలేదనే భయంకరమైన జ్ఞాపకం.ఆరవ షెడ్యూల్ భారతదేశానికి ముప్పుకాదు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన వాగ్దానం. ఈశాన్యరాష్ట్రాలలో ఆరవ షెడ్యూల్ ద్వారా ఏర్పడిన మండళ్లతో శాంతి నెలకొందన్న వాస్తవాన్ని గుర్తించి, మోడీ ప్రభుత్వం చక్కటి రాజకీయ సంకల్పంతో అడుగులు వేయాలి.
గీతార్థ పాఠక్