నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, నసర్లపల్లి నాగార్జునసాగర్ హైవేపై సోమవారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకొండ మండలం, మట్టిక తండాకు చెందిన రాత్లావత్ భాస్కర్ (24), రాత్లావత్ వినోద్ (26), ఉల్చర్ల తండాకు చెందిన రమావత్ రవి (22) ముగ్గురు కలిసి సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుండి ఆటోలో తమ స్వంత గ్రామాలకు వెళ్తున్నారు. నసర్లపల్లి గ్రామ పరిధిలోకి రాగానే దేవరకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న ఉల్చర్ల తండాకు చెందిన జర్పుల కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తన సిబ్భందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.