గ్రాండ్ బ్లాంక్ టౌన్‌షిప్ : అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో కాల్పులు చోటు చేసుకున్న కొన్ని గంటల్లోనే మిషిగన్ రాష్ట్రం లోని చర్చి వద్ద ఆదివారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ రెండు సంఘటనల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. మిషిగన్ రాష్ట్రం లోని గ్రాండ్ బ్లాంక్ లోని మోర్మాన్ చర్చి వద్ద ఆదివారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా ఒకరు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు.
ఆదివారం ఉదయం 10.25 గంటలకు ఈ సంఘటన జరిగింది. నిందితుడు మొదట వాహనంతో చర్చిని ఢీ కొట్టి ఆ తర్వాత నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. చర్చి మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో చర్చిలో వందల మంది ఉన్నారు. సంఘటన జరిగిన 30 నిమిషాల్లోనే నిందితుడు హతమయ్యాడని పోలీసులు చెప్పారు. నిందితుడు థామస్ జాకబ్ స్యాన్‌ఫోర్డ్ (40)గా గుర్తించామని , అతడు గతంలో యూఎస్ మెరైన్‌లో పనిచేశాడని తెలిపారు. అతని నివాసంలో కూడా పోలీసులు సోదా చేశారు. అతని గురించి అదనపు వివరాలు ఏమీ చెప్పడం లేదు. ఈ సంఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు.
దేశం లోని క్రిస్టియన్లను లక్షంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి హింసాత్మక సంఘటనలు వెంటనే ఆగిపోవాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని , వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఉత్తర కరోనాలో ..
ఉత్తర కరోలినా లోని అమెరికన్ షిప్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో (అమెరికా కాలమానం ప్రకారం ) కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. 8 మంది గాయపడ్డారు. గుర్తు తెలియని ఓ బోటు నార్త్ కరోలినా లోని సౌత్ పోర్టు యాట్ బేసిన్‌లో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ వద్దకు వచ్చింది. బోటు లోని వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం దుండగుడు అదే బోటులో పారిపోయాడు. మరోవైపు కాల్పులు, జరిపినట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.