న్యూఢిల్లీ: సాధారణంగా వాహనాలు రోడ్డు మీదకి వచ్చినపుడు ఇంజిన్ సౌండ్ వల్ల హారన్ కొట్టకపోయినా గుర్తించడం సులువే. అదే ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే అవి బ్యాటరీ, మోటార్ సాయంతో పనిచేయడం వల్ల వాటి నుంచి శబ్దం వెలువడదు. కాబట్టి వెనుక నుంచి ఏదైనా వాహనం వస్తున్నా గుర్తించడం కష్టం. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని కేంద్రం భావించి ఎలక్ట్రిక్ వాహనాలకు వెహికల్ అలర్ట్ సిస్టమ్ తప్పనిసరి చేసింది.
2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు ఈ సిస్టమ్ తప్పనిసరి అని రోడ్లు, రవాణా, రహదారి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.న 2026 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలన్నీ అలర్ట్ సిస్టమ్ సదుపాయం తోనే రోడ్లపైకి రావాలని మంత్రిత్వశాఖ విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
వాహనం కదిలే సమయంలో ఈ సిస్టమ్ కృత్రిమ శబ్దాన్ని విడుదల చేస్తుంది. దీంతో పాదచారులు, రోడ్లపై ఉన్న ఇతర ప్రయాణికులు వాహనం వస్తుందని ముందుగానే గుర్తించొచ్చు. ఏఐఎస్ 173 ప్రమాణాల ప్రకారం వినిపించే శబ్ద స్థాయిలతో ఈ సౌండ్ సిస్టమ్ అమర్చాలని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్లలోని కొన్ని దేశాలు హైబ్రిడ్ వాహనాలకు ఏవీఎఎస్ వినియోగాన్ని తప్పనిసరి చేశాయి.