ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ‘స్వదేశీ వస్తువుల ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం&స్వదేశీ వస్తువులనే వాడుదాం..’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం దేశ ప్రజలనుద్ధేశించి ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగాన్ని రాంచందర్ రావు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. అనంతరం రాంచందర్ రావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్వదేశీ వస్తువులనే వాడుతాం అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చేనేతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత దుస్తులను వాడడం ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సహించినట్లు అవుతుందని, వారికి అండగా నిలబడినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడి కూడా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవశ్యకత గురించి నొక్కి చెప్పారని ఆయన వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను వినియోగించాలని ఆయన కోరారు.
అమీర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఇదిలాఉండగా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అమీర్‌పేట, నాగార్జున నగర్‌లో గల కమ్యూనిటి హాలులో వీక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాకతో చుట్టు పక్కల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కమ్యూనిటి హాలుకు చేరుకుని ఆయనతో పాటు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.