రెండు గంటల్లో చేరుకునేలా అధునాతన టెక్నాలజీ
యాక్సిడెంట్ ఫ్రీ రహదారి నిర్మాణం
త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ (ఎన్‌హెచ్65)జాతీయ రహదారి ఎనిమిది లేన్ల విస్తరణ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభ కానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి మాట్లాడుతూ ఎనిమిది లేన్ల విస్తరణకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండడమే కాకుండా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న రహదారుల్లో ఒకటని మంత్రి వివరించారు. ఈ రహదారుల్లో ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేశానని మంత్రి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రమాద రహిత (యాక్సిడెంట్ ఫ్రీ) రహదారిని అందుబాటులోకి తేనున్నామని, అధునాతన టెక్నాలజీ, పూర్తి నాణ్యతతో రోడ్లు నిర్మించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ ఎనిమిది వరుసల రహదారి పనులు పూర్తి అయితే హైదరాబాద్ నుండి విజయవాడకు కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 230 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూర్తి సానుకూలంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. డిపిఆర్ ఎస్టిమేట్స్ త్వరలో పూర్తి కానున్నాయని, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.