హైదరాబాద్: తనకు ఇక్కడ భూములు ఉన్నందువల్లే ఫ్యూచర్ సిటి కడుతున్నానని అంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన కోసం కాదని భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ అని అన్నారు. ఫ్యూచర్ సిటి డెవలప్ మెంట్ అథారిటీ భవనానికి సిఎం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రావిర్యాల- ఆమన్ గల్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 సిఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముందుతరాల కోసం ఆలోచించారని, అందువల్లే హైటెక్ సిటి, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఒఆర్ఆర్ వచ్చాయని తెలియజేశారు.
చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతుంటారని, ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయి గురించి చెప్పుకుంటామని అన్నారు. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలని, ఎన్నాళ్లు విదేశాల గురించి చెప్పుకుంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా అని సూచించారు. తనకు పదేళ్లు సమయం ఇవ్వండని.. న్యూయార్క్ ను మరిపించే నగరం కడతానని, 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? అని రేవంత్ ప్రశ్నించారు.
అభివృద్ధి పనుల వల్ల కొందరికి ఇబ్బందులు కలగవచ్చునని, భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయని, అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటి నుంచి చైన్నైకి బుల్లెట్ ట్రైన్ వయా అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని, ఫ్యూచర్ సిటీలో 500 ఫ్యార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది తన స్వప్నం అని, హైదరాబాద్ లో ప్రస్తుతం 80 ఫ్యార్చ్యూన్ కంపెనీలే ఉన్నాయని అన్నారు. ఫ్యూచర్సి సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని, చిన్న చిన్న విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు అని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, తదితరలు పాల్గొన్నారు.