దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత స్పిన్నర్ల దెబ్బకు పాకిస్థాన్ కుప్పకూలిపోయింది. దీంతో టీమిండియాకు 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకార్ జమాన్(46). తొలి వికెట్ కు వీరిద్దరూ కలిసి 9.4 ఓవర్లలోనే 84 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత ఫర్హాన్ ఔట్ కావడంతో పాక్ ఒక్కసారిగా పట్టుకోల్పోయింది. భారత స్పిన్నర్లు వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ..పాక్ పై ఒత్తడి పెంచారు. దీంతో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్లు వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 19.1 ఓవర్లలోనే పాకిస్థాన్ 146 పరుగులకు ఆలౌటైంది. దాయాది జట్టు.. 33 పరుగులు మాత్రమే చేసి చివరి 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి.. పాక్ వెన్ను విరిచాడు. ఇక, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రాలు తలో రెండు వికెట్లు తీశారు.