షార్జా: నేపాల్ క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సాధించింది. అంతర్జాతీయ టి-20 క్రికెట్‌లో ఐసిసి పూర్తిస్థాయి సభ్యదేశమైన వెస్టిండీస్‌ను ఓడించింది. యుఎఇ వేదికగా జరుగుతున్న మూడు టి-20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్ట్ క్రికెట్ ఆడే జట్టుపై గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కోసం నేపాల్ 180 మ్యాచులు ఎదురుచూసింది. ఈ విజయాన్ని జెన్ జెడ్ నిరసనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం ఇస్తున్నట్లు నేపాల్ జట్టు కెప్టెన్ రోహిత్ పౌడెల్ తెలిపాడు.
‘‘టెస్ట్ క్రికెట్ ఆడే జట్టుపై విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇది సాధ్యపడింది. ఈ సిరీస్‌లో మాకు శుభారంభం దక్కింది. 150 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చని భావించాం. అందుకు తగినట్టే బౌలింగ్ చేశాం. మా స్పిన్నర్లు అదరగొట్టారు. కరణ్, సోంపాల్ ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్లు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నిరసనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం చేస్తున్నా. గత నెల మాకు అత్యంత దుర్భర కాలం. ఈ విజయం మా నేపాల్ ప్రజలకు ఆనందం కలిగిస్తుందని భావిస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని రోహిత్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో విండీస్ విఫలమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు తీసి 129 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణించిన రోహిత్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.