భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మరికాసేపట్లో ఆసియా కప్ 2025 ఫైనల్ పోరు జరగనుంది. దీంతో ఈ మ్యాచ్ పై అటు పాకిస్థాన్ ఫ్యాన్స్ లోనూ.. ఇటు టీమిండియా ఫ్యాన్స్ లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మెగా టోర్నీలో ఇరుజట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడగా.. రెండుసార్లు భారత్.. పాక్ జట్టును చిత్తుగా ఓడించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్ పోరుకు దాయాది జట్లు సిద్ధమయ్యాయి.
దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. ఇక, హైదరాబాద్ నగరంలోనూ అభిమానులు పలు ఆలయాలు, దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని చోట్ల హోమాలు కూడా నిర్వహించారు. ఈ ఫైనల్ మ్యాచ్ లోనూ పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక, మ్యాచ్ చూసేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. గత రెండు మ్యాచ్ లను చూసేందుకు ఇప్పటివరకు పెద్దగా ఆసక్తి చూపని అభిమానులు.. ఈ మ్యాచ్ ను చూసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికే దుబాయ్ స్టేడియంలోని అన్ని సిట్ల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.