హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడిందో నిలదీసి అడిగేందుకే బాకీ కార్డులకు రూపకల్పన చేశామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ, కౌలు రైతులకు రూ. 15000, రైతు కూలీలకు రూ.12000, ఆటో అన్నలకు దాదాపు రూ.24,000 ఇచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500.. పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు నెలకు రూ.4,౦౦౦, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు రూ.500 బోనస్, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? అని అడిగారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని కార్డులలో తెలుపుతామన్నారు. బిఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడమని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు వదలిపెట్టమన్నారు.