రాష్ట్ర నూతన డిజిపిగా ఇంటెలిజెన్స్ డిజిగా పనిచేసిన బి. శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామకపత్రం అందుకున్నారు. ప్రస్తుత డిజిపి జితేందర్ ఈ నెల 30వ తేదీతో పదవీ విరమణ చేస్తుడటంతో ప్రభుత్వం శిధర్‌రెడ్డిని నూతన డిజిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న నూతన డిజిపిగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంటెలిజెన్స్ డిజిగా పనిచేస్తున్న బత్తుల శివధర్ రెడ్డి హైదరాబాద్ లో జన్మించినా ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్న శివధర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత సివిల్ సర్వీసెస్ పూర్తి చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశించారు. విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఏఎస్‌పిగా విధులు నిర్వహించారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. ఎస్‌పి, ఎస్‌ఐబి ఐజిగా మావోయిస్టుల అణిచివేతలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్ గా 2014 నుంచి 2016 వరకు పనిచేశారు.
గ్యాంస్టర్ నయీం ఎన్‌కౌంటర్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ కొసావో పని చేసిన శివధర్ రెడ్డి తనదైన శైలిలో దేశానికి సేవలందించారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సంచలన కేసులను పర్యవేక్షించారు. మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి గా శివధర్ రెడ్డి నియమితులైయ్యారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను కాపాడటంలో పేరుప్రఖ్యాతలు సంపాదించారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసిబి అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా, పర్సనల్ వింగ్ లో ఐజిగా, అడిషనల్ డీజీగా సమర్దవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2023లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి మరల బాధ్యతలు చేపట్టారు.
సాధించిన పతకాలు
పోలీస్ అధికారిగా శివధర్ రెడ్డి నిష్పాక్షికత, నిబద్దతకు అత్యుత్తమ పతకాలు వరించాయి. పోలీస్ శౌర్య పతకం(2002), అంత్రిక్ సురక్ష సేవా పతకం, ఐక్యరాజ్య సమితి శాంతి పతకం(2003), భాతర పోలీస్ ప్రతిభా పతకం(2011), రాష్ట్రపతి విశిష్ట సేవ పోలీస్ పతకం(2020), అతి ఉత్కృష్ట్ సేవ పతకం(2023), అసాధారణ నిఘ కార్యాకలాపాల కోసం అసధరన్ ఆసుచన కుశల్త పతకం(2018), పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో విదేశాంగ మంత్రిత్వ వాఖ నుంచి 2015, 2025లో ఎక్సలెన్స్ పత్రాలు అందుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీతో పదవి విరమణ చేస్తున్న డిజిపి జితేందర్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం శివధర్‌రెడ్డిని డిజిపిగా నియమించింది.