రాష్ట్రంలోని బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రూపొందించిన బిల్లు కేంద్రం వద్ద ఎందుకు పెండింగ్‌లో ఉందో రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పాలని పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఆమె చిత్రపటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అగ్రకులానికి చెందిన వ్యక్తి అయినా బిసిల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించారని చెప్పారు. అందుకే మంత్రివర్గ సమావేశంలో, అసెంబ్లీలో బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించిడం జరిగిందన్నారు. అయినా కేంద్రం వద్ద ఎందుకు పెండింగ్‌లో ఉందో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారిరువురు బిసిల ప్రయోజనాల కోసం ఒక మెట్టు దిగి వస్తే తప్పకుండా బిసి బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. గుజరాత్‌లోని సబర్మతి నది అభివృద్ధి చేసుకున్నట్లు తెలంగాణలో మూసిని సుందరికరించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండరాదని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు మంచి మిత్రుడైనా రాష్ట్రానికి తీసుకుని వచ్చిన ప్రాజెక్టులు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కెటిఆర్ ముద్దాయి..
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు తప్పు చేశారని ఆయన తెలిపారు. ఈ కేసులో కెటిఆర్ ముద్దాయిగా నిరూపించబడ్డారని, శిక్ష తప్పదని ఆయన అన్నారు.