మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్ర భుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వెనుకబడిన తరగుతుల సంక్షేమశాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధా ప్రకాశ్ పేరుతో ఉత్తర్వులు జారీ చే సింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నిక లు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా తన హామీని నిలబెట్టుకుంటూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డు ఐఏఎస్ అ ధికారి బూసాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏకసభ్య క మిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా,రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేష న్లు కల్పిస్తూ జివోను జారీ చేసింది. స్థానిక సంస్థల
ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో వెనువెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోన్నట్టు ప్రకటించింది. కాగా శాసనసభలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా ఆమోదించిన బిల్లుల విషయాన్ని కూడా ఈ జీవో లో ప్రస్తావిస్తూ వీటిని అమ లు చేయబోతుసున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో బిసిల జనాభా ఆధారంగా వారికి అందాల్సిన రిజర్వేషన్లను అందించేందుకు ప్రభుత్వం నిశితంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఇక స్థానిక సమరానికి ప్రభుత్వం శంఖారావం పూరించినట్లు అయ్యింది. కాగా రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలాగే పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు చైర్‌పర్సన్ ఎన్నికలను నిర్వహిస్తుంది.
నేడు ఉన్నతాధికారులతో ఇసి భేటీ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) చర్యలు ప్రారంభించింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు డిజిపి జితేందర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశానంతరం సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.