పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా టికెట్ల ధరలు పెంచడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అక్టోబర్ 9 వరకు ఇదే ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో టికెట్ల ధరలు పెంపునకు సంబంధించి ఓజీ చిత్ర బృందానికి మరో షాక్ తగిలినట్లయింది. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ టికెట్ల ధర పెంపుపై రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొనసాగించేలా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఓజి మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయం విధితమే. ఓజీ ప్రీమియర్స్ షోతోపాటు, విడుదల తేదీ నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వరకు టికెట్ ధరను పెంచుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 24న సింగిల్ బెంచ్ విచారించి, సినిమా టికెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చిత్ర బృందం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేయగా రెండు రోజుల (శుక్రవారం)వరకు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను సింగ్‌ల్ బెంచ్‌లోనే కొనసాగించాలని విచారణను సింగిల్ బెంచ్ ధర్మాసనానికి పంపించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.