దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ గ్రూప్‌ఎలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగిన సంగతి తెలిసిందే. దుబాయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చాలా సప్పగా సాగింది. దాయాదుల సమరం అంటే ఇరు దేశాల అభిమానుల్లో ఎనలేని జోష్ నెలకొంటోంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రెండు దేశాల క్రికెట్ ప్రేమీలు ఎంతో ఆసక్తి చూపుతారు. వేదిక ఏదైనా చిరకాల ప్రత్యర్థుల సమరం చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడం అనవాయితీ. కానీ ఆదివారం రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి వాతావరణం కనిపించలేదు. మైదానం పూర్తిగా నిండలేదు. టివిల్లో కూడా ఈ పోరును చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపలేదు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అయితే ఆసియాకప్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది.
మైదానంలో ఎలాంటి సందడి లేదు. రెండు దేశాలకు చెందిన అభిమానుల్లో ఎలాంటి జోష్ కనిపించలేదు. ఇక రిజ్వన్, బాబర్ ఆజమ్ వంటి స్టార్లు లేక పోవడంతో మ్యాచ్ మరింత పేలవంగా మారింది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశ పరిచింది. ఆ జట్టు ఆటగాళ్లలో స్తబ్ధత నెలకొంది. భారత బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పోయారు. చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరూ కూడా మెరుపులు మెరిపించలేక పోయారు. దీంతో మ్యాచ్‌లో ఎలాంటి ఉత్కంఠత లేకుండా పోయింది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం ఇరు జట్ల మధ్య జరిగిన పోరు చాలా పేలవంగా కొనసాగిందనే చెప్పాలి. దాయాదుల పోరు ఉంటే ఆఖరు వరకు నరాలు తెగే ఉత్కంఠత ఉండేది. బంతిబంతికి మ్యాచ్ ఫలితం చేతులు మారుతూ వచ్చేది. అయితే ఈసారి అలాంటి వాతావరణ కనిపించలేదు. పాక్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో పాక్ టీమ్ ఆశించిన స్థాయిలో స్కోరును సాధించలేక పోయింది. ఇక పాక్ ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది.
పహల్గాం దాడి నేపథ్యంలో..
కొన్ని రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో భారతీయులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్‌తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్ దేశ ప్రజల నుంచి వచ్చింది. అంతేగాక లెజెండ్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. దాదాది జరగాల్సిన రెండు మ్యాచ్‌లను రద్దు చేసుకుంది. ఇక ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు టీమిండియా దూరంగా ఉండాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా వ్యక్తమైంది. కానీ బిసిసిఐ మాత్రం పాక్‌తో మ్యాచ్‌ను ఆడేందుకే మొగ్గు చూపింది. బిసిసిఐ నిర్ణయంతో గుర్రుగా ఉన్న అభిమానులు ఈ మ్యాచ్‌పై ఎలాంటి ఆసక్తి కనబరచలేదు. దీంతో పోరు ఎలాంటి జోష్ లేకుండానే ముగిసింది.
Also Read: పాక్‌పై ఘన విజయం.. అభిషేక్ నయా రికార్డు