
దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణికి సునీతకు టికెట్
అధికారికంగా ప్రకటించిన అధినేత కెసిఆర్
మాగంటి సేవలకు గుర్తింపుగా కుటుంబానికే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ పేరును పార్టీ ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీత పేరును బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ అధికారికంగా ప్రకటించారు. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థిగా ఎంపిక చేశారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ నిబద్ధతను పరిశీలించి, ఆయన పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనకే అవకాశాలెక్కువ: కెసిఆర్
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని, ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ వర్కింగ్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్‌తోపాటు పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రతి అంశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు అన్ని నివేదికలు చెబుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కిందిస్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేసి తద్వారా ఓటర్లలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయాలని కెసిఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
Also Read: https://www.manatelangana.news/telangana-news/telangana-state-news