తిరుపతి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పలువురు కళాకారుల భరతనాట్య నృత్యం విశేషంగా అలరించాయి. ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రంలో కర్ణాటకకు చెందిన ఎమ్ పి సుజీంద్రబాబు బృందం కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ట్రస్ట్ వారు తమ నృత్య కళాకారులతో సంప్రదాయ భరతనాట్య నృత్యం సభను భక్తిమయ సాగరంలో ఓలలాడించింది. ముద్దుగారే యశోదకు, దశావతార స్తుతి ప్రదమైన పాల్కడలి, అదివో అల్లదివో, జయజయ దేవి, క్షీరాబ్ధికన్యకకు, ఏకదంతాయ వక్రతుండాయ వంటి నృత్యములు భక్తజన ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో తిరుపతి పురవాసులు పాల్గొన్నారు.
