దుబాయి: ఆసియాకప్ సూపర్4లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. శ్రీలంకపై బంగ్లా, పాకిస్థాన్‌పై భారత జట్లు విజయం సాధించి జోరుమీదున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. బంగ్లాతో పోల్చితే టీమిండియా చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అభిషేక్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. పాకిస్థాన్‌పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే బంగ్లా బౌలర్లకు కష్టాలు ఖాయం. గిల్ కూడా నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. ఈసారి కూడా ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నారు.
అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కిందటి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అతని ఫామ్ జట్టును కలవరానికి గురిచేస్తోంది. మరో సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా పాకిస్థాన్‌పై విఫలమయ్యాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా సంజు తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కిందటి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడం టీమిండియాకు శుభసూచకంగా చెప్పాలి. ఈసారి కూడా అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌నే జట్టు ఆశిస్తోంది. హార్విక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ రూపంలో మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. ఇది టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. బౌలింగ్‌లోనూ భారత్ బలంగా ఉంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తదితరులు నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఫార్మాట్ ఏదైనా సర్వం ఒడ్డి పోరాడడం బంగ్లా ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. లంకపై గెలవడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే జోరును టీమిండియాపై కూడా కనబరచాలనే పట్టుదలతో జట్టు ఆటగాళ్లు ఉన్నారు. సైఫ్ హసన్, కెప్టెన్ లిటన్ దాస్, తౌహిద్ హృదయ్, జాకేర్ అలీ, మెహదీ హసన్ తదితరులతో బంగ్లా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక ముస్తఫిజుర్ రహ్మన్, మెహదీ హసన్, షరిఫుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
Also Read: భారత్‌పై అఫ్రిది అక్కసు.. అక్కడ అంపైరింగ్ చేయాలంటూ..