ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2014లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా సార్క్ దేశాధినేతలు ఆహ్వానించి, ‘పొరుగు దేశాలతో మైత్రి’కి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత దాదాపు అన్ని దేశాలలో నేడు భారత్ సానుకూల ప్రభుత్వాలులేని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దేశాలలో చైనా ప్రాబల్యం గణనీయంగా పెరుగుతుంది. మరోవంక, ఆయా దేశాలలో కీలుబొమ్మ ప్రభుత్వాల ఏర్పాటులో అమెరికా క్రియాశీల పాత్ర పోషిస్తున్నది. తాజాగా నేపాల్‌లో జరిగిన పరిణామాలు మనకు దిగ్భ్రాంతి కలిగించాయి. గత మూడు సంవత్సరాలుగా పొరుగు ప్రాంతంలో తీవ్రమైన రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి నుండి బంగ్లాదేశ్‌లో పాలన మార్పు వరకు, ప్రతి పరిణామం సుపరిచితమైన స్క్రిప్ట్‌ను చూసింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సామూహిక నిరసనలు ప్రారంభం కావడం, అవి హింసాయుత రూపం దాల్చడం, ప్రభుతాధినేతలపై దాడులకు దారితీయడం, ప్రభుత్వాలు మారడం. ఈ పరిణామాలకు ఆయాదేశాలలో నెలకొన్న అవినీతి పాలకులు, పెచ్చుపెరిగిన నిరుద్యోగం, అధిక ధరలు వంటివి కుంటిసాకులు మాత్రమే కావచ్చు. అంతకన్నా బలమైన కుట్రలు దాగి ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. కేవలం దక్షిణ ఆసియాలో మాత్రమే కాదు. బలమైన ప్రభుత్వాలు ఉన్న చాలా దేశాలలో, ఇరాక్ నుండి సిరియా, ఉక్రెయిన్ వరకు ప్రభుత్వాలను అస్థిర పరచడం, కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పర్చడం, ఆ తర్వాత తమ సైనిక, ఆర్థిక ప్రయోజనాలకోసం ఆ దేశాలను ఉపయోగించుకోవడం సర్వసాధారణమై పోయింది. బహుశా, కేవలం ఇరాన్, భారత్‌లలో మాత్రమే ఇటువంటి ఎత్తుగడలు చెల్లుబాటుకావడం లేదు.
ఈ విధంగా రాజకీయ అస్థిరత్వం ఏర్పడి, కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పడిన అన్నిదేశాలలో అమెరికాకు చెందిన ‘స్వచ్ఛంద సంస్థలు’ ఆ దేశంలోని కొన్ని ఎన్‌జిఒలకు భారీగా నిధులు సమకూర్చడం, వారితో నేరుగా అమెరికా దౌత్యప్రతినిధులు సంబంధాలు పెట్టుకోవడం, పైగా, పలు దేశాలలో ఐఎస్‌ఐ, ఇతర ఇస్లామిస్ట్ సంస్థలు సైతం క్రియాశీలకంగా పనిచేస్తూ, వారికి మద్దతుగా నిలబడటం జరుగుతుంది. ఇప్పుడు నేపాల్‌లో సైతం సరిగ్గా అటువంటి దృశ్యం కనిపిస్తున్నది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలనే ప్రభుత్వ చర్యపై అకస్మాత్తుగా హిమాలయ దేశంలో భారీ నిరసనలు చెలరేగితే అవి అంతటి హింసాయుతంగా మారే అవకాశంగా ఉండదు. కేవలం ఎంపిక చేసినవారి ఇల్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై హింసాయుత దాడులకు ఆస్కారం ఉండదు. ఖాట్మండ్ లోని అతిపెద్ద ఎత్తయిన హిల్టన్ హోటల్‌ను తగులబెట్టిన దృశ్యాలు చూస్తుంటే కేవలం ఎంతో అనుభవం కలిగిన వారీ ఆ విధంగా మొత్తం భవన సముదాయాన్ని తగలబెట్టినట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, నిరసనలు తగ్గలేదు. కెపిచోర్, దేశ్‌చోడ్ (ఓలి ఒక దొంగ, దేశం విడిచి వెళ్ళు) అనే నినాదాలు రాజధాని అంతటా మారుమోగాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమయితే విచారించి, శిక్షలు విధించాలని కోరాలి గాని దేశం విడిచి పారిపొమ్మనడం ఏమిటి? 2024లో బంగ్లాదేశ్‌లో, 2022లో శ్రీలంకలో ఇదే తరహాలో కొనసాగింది. ఇక్కడ దేశీయ సమస్యలపై ప్రజల ఆగ్రహం త్వరగా అవినీతి వ్యతిరేక నిరసనలుగా మారింది.
నేపాల్ మాదిరిగానే, ఈ దేశాలు కూడా యువత నేతృత్వంలోని ఉద్యమాల సందర్భంగా నాయకుల ఇళ్లలో దోపిడీ జరిగింది. నిరసనకారులు వస్తువులను దోచుకోవడం, ఫర్నిచర్ పగలగొట్టడం, బెడ్‌రూమ్‌లలో విశ్రాంతి తీసుకోవడం, స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడం వంటి దృశ్యాలు బంగ్లాదేశ్, శ్రీలంక రెండింటిలోనూ కనిపించాయి. ఇది చివరికి బంగ్లాదేశ్ షేక్ హసీనా, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సలను వరుసగా భారతదేశం, మాల్దీవులకు పారిపోవడానికి బలవంతం చేసింది. ఈ ఉద్యమాల కేంద్ర బిందువులో, లోతైన విషయం ఉన్నట్లు అనిపిస్తుంది. నెలలుగా నేపాల్‌లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. 2008లో నేపాల్ గణతంత్ర రాజ్యంగా మారినప్పటి నుండి, చైనాకు అనుకూలంగా విస్తృతంగా కనిపించే ఓలి, మావోయిస్టు కేంద్రానికి చెందిన పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’, ఐదు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన షేర్ బహదూర్ దేవుబా మధ్య అధికారం తిరుగుతోంది. ముగ్గురు నాయకులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేపాల్ యువత రాజకీయ వ్యవస్థపై మరింత నిరాశకు గురవుతున్నారు. ఆర్థిక స్తబ్దత, నిరుద్యోగం అగ్నికి ఆజ్యం పోశాయి. వాస్తవానికి, యాప్‌లపై నిషేధానికి వారాల ముందు, నేపాల్ రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవనశైలి, అవినీతి ఆరోపణలను వెలుగులోకి తెచ్చే నెపో కిడ్ ప్రచారం సోషల్ మీడియాను ముంచెత్తింది.
ఈ మొత్తం పరిణామాలలో భారత్ ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. ‘విశ్వగురు’ గా ప్రచారం పొందుతున్న ప్రధాని మోడీ పొరుగుదేశాలతో సంబంధాల విషయంలో తప్పటడుగులు వేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. మొక్కుబడిగా ఉన్నప్పటికీ ఓ సమాచార వేదికగా కొనసాగుతున్న సార్క్‌ను మూతబడే విధంగా చేయడంతో ఈ దేశాల మధ్య ఉమ్మడిగా వ్యవహారాలు జరిపే అవకాశం లేకుండాపోయింది. ఆయా దేశాల్లో కొద్దిమంది నాయకులతో సంబంధాలు పరిమితం కావడం కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. మొత్తం దక్షిణాసియాలో నేడు భారత్‌కు విశ్వసించదగిన దేశం అంటూ లేకుండాపోయింది. చివరకు మనపై ఆధారపడి భూటాన్‌లో సైతం మన ప్రభావం తగ్గిపోతుంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా, శ్రీలంక లో రాజపక్ష సోదరులతో మైత్రి ఏర్పర్చుకోవడమే ఆ రెండు దేశాలతో స్నేహంగా వ్యవహరించటంగా భావించాం. అయితే, వారి నిరంకుశ, అవినీతి పాలనకు ఆ దేశాల యువత తిరగబడినప్పుడు మనం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది. సంవత్సరం గడిచినా బంగ్లాదేశ్‌లో మనకు సాధారణ సంబంధాలు సాధ్యం కావడం లేదు. అధికార పక్షానికి చెందిన సోషల్ మీడియా గ్రూపులు ‘బొయికాట్ మాల్దీవులు’ అనే ప్రచారం సాగించడంతో ఈ దేశాధినేతలు వెళ్లి చైనా అధినేత సరసన కనిపించడంతో తిరిగి ఆ చిన్న దేశంతో సంబంధాలు పునరుద్ధరించుకొనేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
2008 వరకు ప్రపంచలంలోనే ఏకైక హిందూ దేశమైన నేపాల్‌తో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడంలో చంద్రశేఖర్ ప్రభుత్వం మినహా మరే ప్రభుత్వం కూడా ఆసక్తి చూపలేదు. దానితో అక్కడి రాజకీయాలు చైనా గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. చివరకు రాజుపైననే దాడి జరిగినా మన విదేశాంగ మంత్రి వెళ్లి సానుభూతి తెలపడం తప్పా ఏమీ చేయలేకపోయారు. ఎంతగా స్నేహహస్తం చాచినా శత్రుదేశంగా మిగిలిపోతున్న పాకిస్థాన్ తీవ్రవాద స్థావరంగా మారిపోయి, నిత్యం భారత్‌పై అసూయతో రగిలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేపాల్ ఆర్మీ చీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడంతో భారత్ అప్రమత్తం కావాల్సి వచ్చింది. పైగా, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడంతో భారత్‌తో పాటు, చైనా కూడా కంగారు పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనా పర్యటన జరపాల్సి వచ్చింది. ఈ పర్యటనకు అందరూ భావిస్తున్నట్లు ట్రంప్ విధిస్తున్న సుంకాల భారం కాకుండా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో మంతనాలు అని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా మీడియా అంతగా ప్రాధాన్యత ఇవ్వని పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా ప్రధాని మోడీకి ఓ ‘రహస్య లేఖ’ పంపారని మీడియాలో వచ్చింది. ఆ లేఖ తర్వాతనే మోడీ చైనా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ సుంకాలపై ‘స్వదేశీ’ అంటూ కఠినంగా మాట్లాడటం ప్రారంభించారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందో ఎవ్వరూ బయటకు చెప్పలేదు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రశ్న తలెత్తుతుంది. ప్రధాని మోడీకి జింగ్‌పింగ్ లేఖ పంపాలి అనుకుంటే నేరుగా పంపవచ్చు గదా? రాష్ట్రపతి ద్వారా పంపాల్సిన అవసరం ఏమిటి? అనే సందేహం కలుగుతుంది. ప్రధానమంత్రి కార్యాలయంలో అమెరికా ఏజెంట్లు ఉన్నట్లు జింగ్ పింగ్ సందేహిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఆ లేఖలో ఏముందో అమెరికాకు తెలియడం ఇష్టం లేకనే రాష్ట్రపతి ద్వారా పంపారని దౌత్య నిపుణులు భావిస్తున్నారు. మొత్తం మీద భారత్ పొరుగు దేశాలలో జరుగుతున్న అస్థిరత ప్రయత్నాలు అన్ని చివరకు భారత్‌ను ఈఉచ్చులోకి లాగేందుకే అని స్పష్టం అవుతుంది. ఇటువంటి సమయంలో భారతప్రభుత్వం ‘ప్రేక్షక పాత్ర’ వహించడం ప్రమాదకర సంకేతాలు మాత్రమే ఇస్తుంది.
Also Read: మోడీ పర్యటనతో మణిపూర్ గాయం మానేనా?
చలసాని నరేంద్ర
98495 69050