ఎవరి దారి వారిదే

మనతెలంగాణ/హైదరాబాద్:హైదరాబాద్‌ స్టేట్‌ నిజాం పాలన నుంచి 17సెప్టెంబర్, 1948 రోజున భారత యూనియన్‌లో చేరడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టాన్ని ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరుతో ప్రతీఏటా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది.తెలంగాణ ప్రాంతం సమైక్య ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో కొనసాగుతోన్నప్పటి నుంచే ఈ వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఈ వేడుకులకు అంతటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. అప్పటివరకు తెలంగా ణ విమోచన పేరుతో బీజేపీ, తెలంగాణ విలీనం పేరు తో వామపక్ష పార్టీలు పోటాపోటీగా ఈ వేడుకలు ని ర్వహించగా,

రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ ప్ర భుత్వం ఏపేరుతో ఈ వేడుకలు నిర్వహించాలనే దా నిపై తర్జన, భర్జనల అనంతరం  ఏ వర్గాన్ని నొప్పించకుండా తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా అధికారికంగా నామకరణం చేసింది. అప్పటి నుంచి పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా అధికారికంగా నిర్వహించింది. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీపరంగా తెలంగాణ విమోచన పేరుతో వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకులకు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఏటేటా భారీగా నిర్వహించడమే కాకుండా మరింత విస్తృతం చేస్తూ వస్తోంది. దీనికి గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకాగా ఈసారి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతున్నారు.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి హైదరాబాద్ లిబరేషన్ డే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ప్రారంభింప చేసింది. ఇలా ఉండగా డిసెంబర్ 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసిన జాతీయ సమైక్యతా దినం పేరుతో కాకుండా గత ఏడాది నుంచి దీనికి ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేసింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మాత్రం తాను అధికారంలో ఉన్నప్పుడు ఖరారు చేసిన జాతీయ సమైక్యతా దినం పేరుతోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన, కేంద్ర ప్రభుత్వ తెలంగాణ విమోచన దినం కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలు ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన సిపిఐ మాత్రం తెలంగాణ విలీన దినోత్సవం పేరుతో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరుతో వేడుకలు నిర్వహిస్తోన్న అంశం మాత్రం ఒక్కటే. అది హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో చేరి ప్రజాసామ్య వ్యవస్థ ఇక్కడ ప్రారంభం కావడం అనేది ఒకే అంశం. అయితే ఈ అంశంతో సంబంధం ఉన్న ఎంఐఎం పార్టీ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉంటూ ఏ కార్యక్రమం నిర్వహించకపోవడం గమనార్హం.

Also Read: గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం