రెవెన్యూ అధికారుల వేధింపులు..భార్యా పిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్‌ తన భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించారు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా.. ఆటో కాలిపోయిన ఘటన మహబూబ్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలలోకి  వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో తన తాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో ఆటోడ్రైవర్ శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీవో కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దస్త్రం వెళ్లగా.. ఆఫ్‌లైన్‌లో తమకు రాలేదని సిబ్బంది చెప్పారు. ఆర్ఐ సాహత్ రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా తనవద్ద అంతలేదని రూ.5 వేలు ఇచ్చానని, కానీ మిగిలినవి ఇస్తేనే దస్త్రం కదులుతుందని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురై.. శంకర్ తన ఆటోపై పెట్రోలు పోసి.. తన భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతో పాటు తనపై పెట్రోలు పోసుకునేందుకు యత్నిస్తుండగా ఆటోకు నిప్పంటుకుంది. ఘటనలో శంకర్ చేతులు కాలాయి.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు శంకర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం