మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీగా విధులు

ట్రాన్స్ జెండర్ల ఉపాధి విషయంలో శ్రధ్ద కనబరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా ట్రాన్స్‌జెండర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం 20 మంది ట్రాన్స్‌జెండర్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సచివాలయంలోని తన ఛాండర్‌లో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్స్‌కు ఆత్మగౌవరంగా బతికేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. ట్రాన్స్ జెండర్స్ సమాజంలో ఎవరికీ తక్కువ కారని, సమాజంలో తలెత్తుకుని బ్రతికే వారని నిరూపించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.

సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300- నుండి 400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా తలెత్తుకొని తిరిగే భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. మీరు ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలని మంత్రి ఉద్బోధించారు. మహిళా, శిశు సంక్షేమ, ఎస్‌సి అభివృద్ది విభాగం సీనియర్ ఐఎఎస్ అధికారి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ట్రాన్స్‌జెండర్‌లను తక్కువ చేసి చూశారని, ఇప్పుడు అదే సమాజం అంగీకరించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఒక చిన్న అడుగుతో గొప్ప మార్పు సాధ్యం అవుతుందని, మీరు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు మీకే వస్తుంది అని వారి నుద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ గదులు, మైత్రి క్లినిక్‌ల ద్వారా మానసిక సహాయం, గుర్తింపు కార్డులు, స్కిల్ డెవలప్‌మెంట్, బ్యాంకు లింకేజీ లేకుండా ఆర్థిక సహాయం వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ట్రాన్స్‌జెండర్ల సేవలకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ నియామకాలు ప్రైవేట్, పబ్లిక్ రంగాలపై ప్రభావం చూపి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని అన్నారు. బాధితులు అన్న ముద్ర నుండి భాగస్వాములు అనే గౌరవప్రదమైన స్థాయికి ఈ నియామకాలు తీసుకెళ్తున్నాయన్నారు. ఇది ఉద్యోగం మాత్రమే కాదు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, సమాజంలో నిలబెట్టే జీవితం వైపు తీసుకెళ్లే విప్లవాత్మక అడుగు అని ఒక ట్రాన్స్‌జెండర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఎస్‌ఐఎస్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులు గిరిజష్ పాండే, ట్రాన్స్‌జెండర్లకు యూనిఫామ్‌లను స్పాన్సర్ చేసిన దీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ముకుంద మాల, మౌంట్ ఫాంట్ సోషల్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ వర్గీస్ తెక్కనాథ్, ట్రాన్స్ వెల్ఫేర్ ఫౌండర్ వాసవి తదితరులు పాల్గొన్నారు.

Also Read: సుదర్శన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారు: పాడి కౌశిక్ రెడ్డి