వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బిజెపి నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిజెపిది నకిలీ జాతీయవాదమని, తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం)
మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి అని వ్యాఖ్యానించారు. పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడించిన బిజెపికి బిఆర్‌ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదని అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యం అని విమర్శించారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోడీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కెటిఆర్ అన్నారు.
ఇంతకన్నా అసమర్థతత ఇంకోటి ఉంటదా..? : కెటిఆర్
కాంగ్రెస్ సర్కారు ఘోర తప్పిదం వల్ల ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. చివరికి హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి పార్థివదేహాలను మూడురోజులైనా గుర్తించలేరా..? అని ప్రశ్నించారు. ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటదా..? అని అడిగారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్‌కు వినిపించడం లేదా..?
అని ప్రశ్నించారు. చిన్న పాటి వర్షానికే పొంగిపొర్లుతున్న నాలాలు, చివరికి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే సిఎం మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి ఏం చేస్తున్నట్టు..? అని నిలదీశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను కూడా నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో ఆరుగురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారని అన్నారు. నాలాల్లో బలిచేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బిఆర్‌ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Also Read: భారత క్రికెట్ జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్ ఎవరంటే..