ఇరవైరెండేళ్ల మహ్సా జినా అమిని మరణం తర్వాత ఇరాన్ అంతటా 2022లో మహిళలు, జీవితం, స్వేచ్ఛ నిరసనల కోసం వీధుల్లోకి వచ్చి మూడు సంవత్సరాలు అయింది. నిరసనలకు ప్రతిస్పందనగా, ఇరాన్ అధికారులు ప్రాణాంతకమైన అణచివేతను ప్రారంభించారు. దీని ఫలితంగా హత్య, హింస, అత్యాచారం వంటి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, మానవాళిపై నేరాలు జరిగాయి. కానీ జవాబుదారీతనం కోసం విస్తృత డిమాండ్లు ఉన్నప్పటికీ, క్రూరమైన హింసకు గురైన బాధితులు, వారి కుటుంబాలు న్యాయం కోసం వేచి ఉన్నాయి. నిరసనల తర్వాత కూడా అధికారుల తీవ్ర హక్కుల ఉల్లంఘనలు కొనసాగాయి. సెప్టెంబర్ 16, 2022న కస్టడీలో మహ్సా అమిని మరణానికి దారితీసిన వివక్ష, అవమానకరమైన తప్పనిసరి హిజాబ్ చట్టాలు, విధానాలను అధికారులు అమలు చేస్తూనే ఉన్నారు.
2022 మహిళ, జీవితం, స్వేచ్ఛ నిరసనల సమయంలో, ఆ తర్వాత అంతర్జాతీయ చట్టం ప్రకారం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, నేరాలపై ఇరాన్ అధికారులు ప్రభావవంతమైన, నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తులను నిర్వహించడంలో విఫలమయ్యారని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ మిషన్ మార్చి 2024లో తన మొదటి నివేదికలో, నిరసనలపై ఇరాన్ అధికారులు చేసిన ఘోరమైన అణచివేత ఫలితంగా హత్య, హింస, అత్యాచారాలతో సహా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, మానవాళిపై నేరాలు జరిగాయని తేల్చింది. పైగా, జవాబుదారీతనంకోసం దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లు విస్తృతంగా ఉన్నప్పటికీ, నిరసనలను అణచివేసేందుకు, నిరసనకారులను దూషించినందుకు, బాధితులు, వారి కుటుంబాల ఫిర్యాదులను తోసిపుచ్చినందుకు, చంపినా, ఉరితీసిన కుటుంబాలను హింసించినందుకు అధికారులు భద్రతా దళాలను ప్రశంసించడం విస్మయం కలిగిస్తోంది.
‘ఇరాన్ అధికారుల చేతుల్లో క్రూరమైన హింసకు గురైన బాధితులు, వారి కుటుంబాలకు న్యాయం లభించే అవకాశాలు లేవు. ఎందుకంటే పరిష్కారం అందించాల్సిన వారు ఉల్లంఘనలు, నేరాలలో చిక్కుకున్నారు. బాధ్యత వహించే ఇతరులను జవాబుదారీతనం నుండి కాపాడుతున్నారు’ అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లో సీనియర్ ఇరాన్ పరిశోధకుడు బహర్ సబా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇటువంటి కేసులను విచారించగల దేశాలు అలా చేయడానికి ప్రతి అవకాశాన్ని వెతకాలి’ అని సూచించారు. స్త్రీ, జీవితం, స్వేచ్ఛ నిరసనలకు సంబంధించి ఇరాన్ అధికారుల మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనలు వీధి నిరసనల తర్వాత కూడా చాలా కాలం పాటు కొనసాగాయి. 2025 మార్చి లో తన రెండవ నివేదికలో, ఐరాస నిజనిర్ధారణ మిషన్, న్యాయం కోరుతూ మహిళలు, బాలికలు, మైనారిటీ సభ్యులు, బాధితులు, వారి కుటుంబాలపై అధికారులు హింసకు పాల్పడుతూనే ఉన్నారని కనుగొంది. అధికారులు ఇటీవల కనీసం ఇద్దరు పురుషులను ఉరితీశారు, నిరసనలకు సంబంధించి అనేక మందికి మరణశిక్ష విధించారు.
మోజాహెద్ కౌర్కోరీని జూన్ 11న ఉరితీశారు. మహిళలు, జీవితం, స్వేచ్ఛ ఉద్యమానికి సంబంధించి తీవ్ర అన్యాయమైన విచారణ తర్వాత అధికారులు అతన్ని తీవ్రంగా హింసించి మరణశిక్ష విధించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నమోదు చేసింది. సెప్టెంబర్ 6న మెహ్రాన్ బహ్రామియన్‌ను ఉరితీశారు. నిరసనలకు సంబంధించి ఉరితీసిన పన్నెండవ వ్యక్తి. ఓస్లోకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ, అధికారులు ఒప్పుకోలు పొందడానికి బహ్రామియన్‌ను హింసించారని నివేదించింది. అధికారులు వివక్ష, అవమానకరమైన తప్పనిసరి హిజాబ్ చట్టాలు, విధానాలను అమలు చేయడం కొనసాగించారు. దీని ఫలితంగా సెప్టెంబర్ 16, 2022న 22 ఏళ్ల మహ్సా జినా అమిని కస్టడీలో మరణించారు. ఆమె చట్టవిరుద్ధ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఐరాస నిజనిర్ధారణ మిషన్ స్పష్టం చేసింది. అప్పటి నుండి, మహిళలు, బాలికలు తప్పనిసరి హిజాబ్ నియమాలను పాటించేలా బలవంతం చేయడానికి అధికారులు విస్తృత శ్రేణి హింసాత్మక, అణచివేత చర్యలను అనుసరిస్తున్నారు.
వీటిలో ఏకపక్ష అరెస్టులు, నిర్బంధం, అన్యాయమైన ప్రాసిక్యూషన్, కఠినమైన శిక్షలు, ప్రాథమిక సేవల తిరస్కరణ, విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా ప్రాథమిక హక్కులను కోల్పోవడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం, నిఘా సాంకేతికతలను ఉపయోగించడం ఉన్నాయి. చాలా మంది ఇరానియన్ మహిళలు తీవ్రమైన ప్రమాదాలు, అపారమైన వ్యక్తిగత ఖర్చులు ఉన్నప్పటికీ, తమ మానవ హక్కుల కోసం డిమాండ్ చేస్తూనే ఉంటామని హ్యూమన్ రైట్స్ వాచ్‌కు చెప్పారు. తీవ్ర, శాశ్వత గాయాలతో సహా నిరసనలపై ప్రభుత్వ హింసాత్మక దాడుల నుండి బయటపడిన చాలా మంది, అరెస్టు, హింస, క్రిమినల్ ప్రాసిక్యూషన్ల బెదిరింపుల కారణంగా ఇరాన్‌ను విడిచి వెళ్ళవలసి వచ్చింది. పొరుగు దేశాలలో కొందరు ఇప్పటికీ అయోమయ స్థితిలోనే ఉన్నారు. అక్కడ వారికి భద్రత, వైద్య, మానసిక సంరక్షణ, అవసరమైన చికిత్సలు అందుబాటులో లేవు. ఐరోపాతో సహా మూడవ దేశాలలో రక్షణ పొందిన వారు, దీర్ఘకాలిక శారీరక నొప్పి, వైద్య సమస్యలు, పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్లు, మానసిక గాయం వంటి వారు అనుభవించిన నేరాల జీవితాన్ని మార్చే పరిణామాలను కూడా భరిస్తున్నారు.
బహిరంగంగా మాట్లాడేవారు లేదా క్రియాశీలతలో పాల్గొనేవారు ఇరాన్‌లోని తమ ప్రియమైనవారి భద్రత పట్ల భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు వేధింపులు, విచారణలు, గృహ దాడులను అనుభవించారు. అయినప్పటికీ, బాధితులు నిజం, న్యాయం, స్వేచ్ఛను అనుసరించాలనే తమ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ‘నేను ఇకపై నా శరీరం ఎడమ వైపున నిద్రపోలేను’ అని నిరసనల సమయంలో లోహపు గుళికలతో కాల్చవేతకు గురైన ఒక యువకుడు చెప్పాడు. ‘సుమారు 10 నిమిషాల తర్వాత, నన్ను పదేపదే కత్తితో పొడిచి చంపినట్లు అనిపిస్తుంది.. మానసికంగా ఇది నన్ను భయపెడుతుంది. నేను జిమ్‌లో భారీ బరువులు ఎత్తేవాడిని, ఇప్పుడు ఏమీ ఎత్తలేను. (కానీ) రేపు నిరసనలు ప్రారంభమైతే, నేను తిరిగి వీధుల్లోకి వస్తాను’ అని స్పష్టం చేసాడు. అంతర్జాతీయ చట్టం ప్రకారం, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, నేరాలకు కారణమైన వారిని దర్యాప్తు చేసి తగిన విధంగా విచారించడం, ఉల్లంఘనలకు గురైన బాధితులకు సత్వర, తగిన పరిష్కారం లభించేలా చూడటం ఇరాన్ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత.
అయితే, ఇరాన్‌లో శిక్షార్హత చారిత్రాత్మకమైనది. స్త్రీ, జీవితం, స్వేచ్ఛ నిరసనలకు చాలా కాలం ముందు నుండి ఉంది. జవాబుదారీతనాన్ని నిర్ధారించే బదులు, ఉల్లంఘనలు, నేరాలకు కారణమైన వారిని రక్షించడానికి ప్రభుత్వం దేశంలో చట్టపరమైన, న్యాయ నిర్మాణాలను ఏర్పాటు చేసింది. సార్వత్రిక, ఇతర భూభాగాంతర అధికార పరిధిని అమలు చేసే అన్ని దేశాలు స్త్రీ, జీవితం, స్వేచ్ఛ నిరసనల సమయంలో, తరువాత ఇరాన్ అధికారులచే అంతర్జాతీయ చట్టం ప్రకారం నేరాలపై తగిన నేర పరిశోధనలను ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాలి. మహిళలు, జీవితం, స్వేచ్ఛ నిరసనల నుండి బయటపడ్డ చాలా మంది ఇరాన్ పొరుగు దేశాలలో అసురక్షిత పరిస్థితులలో నివసిస్తున్నారని గ్రహించి, భద్రత, రక్షణ, మానవతా సహాయం పొందడానికి వారి ప్రయత్నాలకు సహాయం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు సమన్వయంతో చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవంక, డెమొక్రాటిక్ రిపబ్లిక్ కుప్పకూలి, తాలిబన్ల రాజ్యం నెలకొని నాలుగేళ్లు దాటాయి. గతంలో మాదిరిగా కాకుండా తమ పద్ధతులు మార్చుకుంటామని ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు.
నాలుగు సంవత్సరాల తరువాత, తాలిబాన్ అణచివేత పాలనతో, క్రూరమైన సామర్థ్యంతో చట్టం, న్యాయం, పౌర హక్కుల సంస్థలను కూల్చి వేసింది. తాలిబాన్ మహిళలు, బాలికలపై అణచివేత పరాకాష్టకు చేరింది. మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు దీనిని ‘లింగ వర్ణవివక్ష’ అని పిలుస్తున్నాయి. దీన్ని సరికొత్త అంతర్జాతీయ నేరంగా పేర్కొంటున్నాయి. శాసనాలు మహిళలను ప్రజా జీవితం నుండి తుడిచిపెట్టాయి. ప్రాథమిక పాఠశాల (మత విద్య మినహా), ఉద్యోగం, ప్రజా స్థలాలకు మించి విద్య నుండి వారిని నిషేధించాయి. మహిళలు మహర్మ్ లేదా పురుష సంరక్షకుడు లేకుండా బహిరంగంగా స్వేచ్ఛగా తిరగలేరు. తాలిబాన్ మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా కూల్చివేసి, దానిని ధర్మ ప్రచారం, దుర్గుణ నివారణ మంత్రిత్వ శాఖతో భర్తీ చేసింది. అణచివేతకు కేంద్ర సాధనంగా, మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా దాడులు, అరెస్టులు, నిఘా, బహిరంగ స్థలాల పర్యవేక్షణ ద్వారా సంస్థాగత లింగ వివక్షను బలోపేతం చేస్తుంది. తాలిబాన్ ప్రభుత్వం తన ఏకాకితనాన్ని అంతం చేయడానికి, చట్టబద్ధతను పొందడానికి ప్రయత్నిస్తున్నందున, అంతర్జాతీయ సమాజం ఇప్పుడు నిజమైన ఒత్తిడిని ఈ ప్రభుత్వంపై తెచ్చేందుకు ఉపక్రమిస్తుందా? చూడాలి.
Also Read: నేతల సంపద పైపైకి.. అభివృద్ధి అడుగుకు
చలసాని నరేంద్ర
98495 69050