సరదా, ఎంజాయ్‌మెంట్ కోసం ఇతరుల ప్రాణాలు బలితీసుకోవద్దని సినీ నటుడు కిరణ్ అబ్బవరం అన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సిఎస్‌సి), హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా జల విహార్, నెక్లెస్ రోడ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ సమ్మిట్ – 2025లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో పాలసీ మేకర్లు, పరిశ్రమ ప్రముఖులు, ట్రాఫిక్ నిపుణులు, శాసనసభ సభ్యులు, విద్యావేత్తలు పాల్గొని నగర రవాణా, రోడ్డు భద్రతకు సంబంధించిన సవాళ్లు, పరిష్కారాలపై చర్చించారు. ట్రాఫిక్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అథితిగా సినీ నటుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తన సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలిపారు. తన సోదరుడు మృతిచెందే వరకు ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకునే వాడిని కాదని, సోదరుడి మృతితో మారిపోయానని తెలిపారు.
ఇంటికి క్షేమంగా వెళ్లాలి, కుటుంబం ఉందని, కుటుంబానికి తన అవసరం ఉంది అని తాను అలోచిస్తూ కారు స్టీరింగ్ పట్టుకుంటాను అని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ నగరంలో 92 లక్షల వాహనాలు ఉన్నాయని, రోజుకు 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఆధునిక సిగ్నల్ వ్యవస్థలు, వీఐపీ కాన్వాయ్ నిర్వహణ, డ్రోన్, హై-రైజ్ కెమెరా మానిటరింగ్, గూగుల్ తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునాతన సాంకేతిక పద్ధతులపై నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సమాజం, శాసనసభ సభ్యులు, పరిశ్రమల మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇక నుండి హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాన్లా పల్స్ యాప్ అందుబాటులో ఉంటుంది తెలిపారు.