రేవంత్ రెడ్డి వేధింపుతోనే మెట్రో నుంచి తప్పుకుంటున్న ఎల్‌అండ్‌టీ
’కుడితిలో ఎలుకల’ మాదిరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి
‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’గా మారింది
త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయిన అజారుద్దీన్
యువతతో పెట్టుకున్న రేవంత్‌రెడ్డి పతనం తప్పదు
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉంది
తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ అన్ని వర్గాల పైన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయని, ఆరోగ్యశ్రీ సేవలు రద్దు చేయడంతో హాస్పిటళ్లు స్తంభించాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన ఒక్క పని అయినా చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆశా వర్కర్లు, రేషన్ డీలర్ల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదని, గతంలో ప్రగతి భవన్ గురించి అనేక అబద్ధాలు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’ అయిందని, ‘హైడ్రా’కు పెద్ద వాళ్ళు కనిపించరని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలని సూచించారు.
వాయిస్ వినిపించే హక్కు ఉంది
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని, తమ వాయిస్ వినిపించే హక్కు ఉందని కేటీఆర్ అన్నారు. కొత్త పార్టీలు పెట్టుకుని తమ విధానాలను ప్రజలకు చెప్పి వారి దగ్గరకు వెళ్లవచ్చని స్వాగతించారు. తాము బతుకమ్మ చీరలు కులం, మతం, అంతం, వేదం లేకుండా అందరికీ ఇచ్చామని, అయితే ఈ ప్రభుత్వం కొందరికి మాత్రమే ఇస్తోందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో బంధుప్రీతి లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ దీటుగా స్పందించారు. సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డిలకు వందల కోట్ల కాంట్రాక్టులు కొత్తగా ఇచ్చారని, మరి బంధుప్రీతి లేని ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పని అని ఆరోపించారు. అసెంబ్లీలో మైక్ ఇస్తే తాము కూడా మాట్లాడతామని, ప్రభుత్వాల తీరును వివరిస్తామని అన్నారు.
అందుకోసమే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ
అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదన్నారు. ఈ విషయంలో గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదని అనుకుంటున్నానని చెప్పారు. అజారుద్దీన్ క్రికెట్లో బాగా కట్లు కొట్టేవారని, ఇప్పుడు హజరుద్దీన్ కే పెద్ద కట్ కొట్టారని సెటైర్ వేశారు. అజారుద్దీన్‌ను సంతృప్తి పరిచేందుకు, ముస్లింల ఓట్ల కోసం ఎమ్మెల్సీ అని ప్రకటించారని విమర్శించారు. అజారుద్దీన్ త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయారన్నారు.
రేవంత్ రెడ్డి వేధింపులతో ఎల్ అండ్‌టీ దూరం
ముఖ్యమంత్రి బెదిరింపులు, ముడుపుల కోసం వేధింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ వైదొలుగుతోందని కేటీఆర్ అన్నారు. గతంలో ఎల్ అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించారని, ఇలాంటి దుర్మార్గమైన చర్యల వల్ల ప్రైవేటు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. గతంలో పలు కంపెనీలపై ఉన్న కేసులను అడు ్డపెట్టుకుని సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని, అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా, పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాల్సింది పోయి పక్కన పెట్టారని అన్నారు.
నేతన్నలపై పగ తీర్చుకుంటున్న రేవంత్
తనపై ఉన్న వ్యక్తిగత కోపాన్ని రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల పైన తీర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టి మొత్తం పరిశ్రమను అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేదని, దేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ దందా రాష్ట్రంలో జరగడం దారుణమని అన్నారు. ఇంత పెద్ద అరాచకం జరుగుతుంటే ఈగల్ టీం, హైడ్రా అంటూ ఎందుకు తమాషాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు హైడ్రా ఇప్పటిదాకా ఏం పని చేసిందని, ఇవన్నీ చేస్తే వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం ఎందుకు మునిగిపోతుందని నిలదీశారు.
కుడితిలో పడ్డ ఎలుకల్లా ఎమ్మెల్యేలు
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ’కుడితిలో ఎలుకల’ మాదిరిగా మారిందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాడిన ప్రతి ఒక్కరూ దారుణంగా మోసపోయారని అన్నారు. నిజంగా రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలని సవాలు విసిరారు. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ బీ-ఫారమ్‌తో పోటీ చేసిన దానం నాగేందర్ స్పీకర్‌ను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు.
తమ భూముల కోసం అలైన్‌మెంట్ మారుస్తున్నారు
రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామని, కానీ దాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. దీంతో వేలాది మంది రైతులు తమ భూములు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారన్నారు. ఫోర్త్ సిటీ దగ్గర ఉన్న తమ భూముల కోసం అలైన్‌మెంట్ మార్చి, రీజినల్ రింగ్ రోడ్ స్వరూపాన్ని మార్చేశారని, దీని వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డుకి, ఫోర్త్ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్డు కేవలం రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసం వేస్తున్నారని, ఈ రోడ్డు వెంబడి అనేక మందితో భూములు కొనుగోలు చేసి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు.
ఎంపీలను అమ్మేసిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్నింటినీ అమ్మేస్తాడని, గతంలో పీసీసీ పీఠాన్ని కొని, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి మేకలు, గొర్రెల మాదిరిగా అమ్మేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అని ఎవరూ అనుకోవడం లేదని, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మీడియా మేనేజ్‌మెంట్, పీఆర్ మేనేజ్‌మెంట్ మీద నడుస్తోందని, క్షేత్రస్థాయిలో ఏం జరగడం లేదని విమర్శించారు. నిజంగా పాలన బాగుంటే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మూడు రంగుల జెండా పాట ఎందుకు వినిపించడం లేదని అన్నారు. రానున్న సంవత్సర కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వరుసగా వస్తాయని, కనీసం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనంత బలహీనంగా ఉందని కేటీఆర్ అన్నారు.
యువతతో పెట్టుకున్న రేవంత్ రెడ్డి పతనమే
రేవంత్ రెడ్డి యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు యువతతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని, ఆయన పతనం తప్పదని అన్నారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలను రాష్ట్ర హైకోర్టు గుర్తించిందని, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని కూడా గుర్తించిందని తెలిపారు. మూడు కోట్ల రూపాయలకు గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే చెబుతున్నారని, ఏ మంత్రి డబ్బులు తీసుకున్నారో అభ్యర్థులనే అడగాలని అన్నారు. ఆ మంత్రి పేరును కూడా అభ్యర్థులు చెప్పారని తెలిపారు. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.
పూర్తిగా దిగజారిన శాంతిభద్రతల పరిస్థితి
హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఆడబిడ్డలు హత్యకు గురైతే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల మరణాలు అనుమానాస్పద అత్యాచారాలుగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కనీసం మాట్లాడడం లేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆడబిడ్డల ప్రాణాలు అంత చులకన అయిపోయాయన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి స్పందించలేదని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌కి సంబంధించి అప్పుడే ఇన్ని షరతులు పెట్టేది ఉండేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారన్నారు. ఇది రేవంత్ రెడ్డి గతంలో రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఇస్తే ఉరితీయాలని అన్నారని గుర్తు చేశారు.