గ్రేటర్‌లో అనేక చోట్ల భారీ వర్షం
శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12.6 సెం.మీటర్ల వర్షపాతం
కొన్ని గంటల్లోనే కురిసిన కుండపోతతో జలమయమైన రహదారులు
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా 9సెం.మీ.లకుపైగా కురవడంతో నగర రోడ్లు జలాశయాలుగా మారాయి. ము ఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో 9 సెం.మీ.లకు పైగా వర్షం భారీగా కురిసింది.దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయా యి. ట్రాఫిక్ తీవ్ర సమస్యగా మారింది. సా.4గంటల నుంచి శివారు ప్రాంతాల్లో వర్షం కురవగా, కోర్ సిటీలో 6.30 గంటల నుంచి కురుస్తూ.. రాత్రి 9 గం.ల నుండి భారీ వర్షం కారణంగా రోడ్లను వరదనీరు ముంచెత్తింది. వాహనాలు భారీగా నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో జనం ఇండ్లకే పరిమతమయ్యారు. ప్రధాన రహదారులు మొదలుకొని అంతర్గత రహదారులు చెరువులను తలపించాయి. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.6సెం.మీ.లు కురియగా సికింద్రాబాద్‌లో 10.2 సెం.మీటర్లు, బేగంపేటలో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ వద్ద రహదారిపై వరద నీరు పొంగిపొర్లింది. ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌లోని గాంధీనగర్‌లో వరద నీటిలో ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. మియాపూర్ 6.65 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది. వర్కింగ్ డే కావడంతో కార్యాలయాల నుండి ఇండ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కెబిఆర్ పార్కు, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, అల్వాల్, కొంపల్లిలో భారీగా వర్షం కురవడంతో వాహనదారులు గంటల తరడఃబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మియాపూర్ రైల్ అండర్ బ్రిడ్జీ వద్ద వరదనీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డీఆర్‌ఎఫ్ మాన్సున్ టీమ్స్ రంగంలోకి దిగాయి. వర్షపునీరు చేరిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వర్షం కారణంగా అత్యవరమైతే హైడ్రా హెల్ప్ లైన్ నెంబర్ కి 9000113667 సంద్రించాలని అధికారులు చెబుతున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040—21111111 ని కూడా సంప్రదించాలని కోరారు.
అప్రమత్తంగా ఉండండి : సిఎం
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్‌కు అంతరాయం ఉన్న చోట్ల వెంటనే పోలీస్ హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు తగిన చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఉన్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సిఎం సూచించారు. జిహెచ్‌ఎంసి, విద్యుత్ విభాగాల అధికారులు వర్షం ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు.
Also Read: హలీవుడ్ స్థాయికి హైదరాబాద్