సర్కార్‌ను నడిపే సత్తా రేవంత్‌కు లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్ర భుత్వానికి పాలనను నడిపించే సత్తా లేదని, అందుకే ప్రతిసారీ పాత ప్రభుత్వంపై నెపం నెట్టేస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తమ చేతగానితనా న్ని గతం చాటున దాచిపెడుతున్నారని మం డిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, అందరికీ వారిపై నమ్మకం పోయిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ భ ద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ,

కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మోసమే పునాది అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదని, అబద్ధాల పునాదుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇది ప్రజలకు తీరని ద్రోహం అని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడమే తమ నైజం అని రేవంత్ రెడ్డి గతంలోనే చాలాసార్లు స్పష్టంగా చెప్పారని, అయినప్పటికీ ప్రజలు ఆయన అబద్ధపు హామీలు నమ్మి ఓటు వేసి మోసపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే పాతకాలపు కాంగ్రెస్ రోజులను తీసుకువచ్చిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి, ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ మోసాన్ని వివరించడంలో విఫలమయ్యాం
కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో పార్టీగా విఫలమయ్యామంటూ కెటిఆర్ ఈ సందర్భంగా తమ పార్టీ వైఫల్యాన్ని కూడా ఒప్పుకున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని అన్నారు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ, మోసపు పార్టీ అని ప్రజలకు వివరిస్తే బాగుండేదని చెప్పారు. అయితే అనేక త్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంపైనే దృష్టి పెట్టామని, రాజకీయాలపై దృష్టి పెట్టలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న తీరుగా అప్పుడు ప్రతిపక్షాలను అణచివేసి ఉంటే, కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా మిగిలేవాడు కాదు అని పేర్కొన్నారు.

ఫిరాయించిన ఎంఎల్‌ఎల ఓటమి ఖాయం
పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకొని ప్రతి ఎన్నికను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతున్నదని కెటిఆర్ అన్నారు. బిఅర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని అడిగారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరారు.. ఉప ఎన్నికలకు పోదామని చెప్పాలని సవాల్ విసిరారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు అని….ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు ఓటమి ఖాయం అని పేర్కొన్నారు. ఫిరాయింపుల కారణంగా పార్టీలో కల్తీ పోయిందని, ఎవరు ఏంటో తెలిసిపోయిందని చెప్పారు. ఇప్పుడు పార్టీ మరింత బలంగా మారిందని తెలిపారు. పార్టీ మారిన ఎంఎల్‌ఎలు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీసం ముఖ్యమంత్రి లేదా రాహుల్ గాంధీకి కూడా తమ పార్టీలో చేర్చుకున్న వారిని తమ ఎంఎల్‌ఎలు చెప్పుకునే దమ్ము లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు వద్దంటే, రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు చేసి బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

లక్కీ లాటరీలో మంత్రి అయిన పొంగులేటి పెద్దగా మాట్లాడుతున్నారు
గత దీపావళికి బాంబులు పేలుతాయి అని మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ దీపావళి వచ్చిందని గుర్తు చేశారు. తంతే గారెలు బుట్టలో పడినట్టు, లక్కీ లాటరీలో పడ్డట్టు మంత్రి అయిన పొంగులేటి పెద్దగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన దాడుల గురించి కేంద్రం గానీ, ఆయన గానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బతికినంత కాలం ధైర్యంగా బతకాలి కానీ ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను, కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలను ఎదుర్కొంటున్నది తమ పార్టీయేనని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్,బిజెపి పార్టీ ఏకైక లక్ష్యం తెలంగాణ గొంతుకైన బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయడమేనని ఆరోపించారు. కానీ, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో పార్టీ ఎల్లకాలం బలంగా ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల తరపున కోట్లాడుతూనే ఉంటామని చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక తెలుగు నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు.భద్రాద్రి నుంచి వచ్చారు కాబట్టి రాముని చరిత్రే మనకు ఆదర్శం అని, వనవాసం అనంతరం పుణ్యపురుషుడు రాముడు పట్టాభిషిక్తుడయ్యారని తెలిపారు. మళ్ళీ మనందరం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read:గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం