వలసదారులకు నో ఎంట్రీ

అభివృద్ధి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు నెలకొని ఉన్న కొన్ని దేశాలు ప్రస్తుతం అలజడులకు లోనవుతున్నాయి. అక్రమంగానో, సక్రమంగానో తమ దేశాల్లోకి ప్రవేశించి, తిష్ఠవేసుకుని కూర్చున్న వలసదారులవల్ల తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటడమే కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, తమ జాతీయ, సాంస్కృతిక విలువలు తరిగిపోతున్నాయని ఆయా దేశస్థులు సాగిస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగినవే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే వలసలకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అమెరికన్లకే పెద్దపీట వేస్తూ వలసదారులపై కఠినమైన ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. పదవిలోకి వచ్చీరాగానే అక్రమంగా తమ దేశంలో తిష్ఠవేసుకు కూర్చున్న అక్రమ వలసదారుల్ని సైనిక విమానాల్లో వెనక్కు పంపేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇప్పుడు విదేశీయుల రాకపైనా కఠినమైన ఆంక్షలు మోపుతున్నారు. తద్వారా అన్ని రంగాల్లో అమెరికన్లకే పెద్దపీట వేయాలన్నది ఆయన ఆకాంక్ష.

ఇతర దేశాలనుంచి వచ్చి తమ దేశంలో చట్టబద్ధంగా ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నవారి వల్ల స్వదేశీయులకు ఉపాధి కరవవుతోందన్నది ఆయన ఆక్రోశం. ఇప్పుడు ఆయన ఆలోచనలను అందిపుచ్చుకున్న అమెరికన్లు కూడా వలసలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరి చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న ఇతర దేశీయులకు ప్రాణసంకటంగా మారింది. అడపాదడపా వారిపై దాడులు జరుపుతున్న కొందరు దుండగులు అమెరికాను వదిలివెళ్లకపోతే ఇలాంటి దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇదే తరహాలో బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లండ్ వంటి దేశాల్లోనూ ప్రజాఉద్యమాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియాలో ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ అని నినదిస్తూ అనేక నగరాల్లో వలసలకు వ్యతిరేకంగా ర్యాలీలు జరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్ లోనూ ఈ ధోరణి మొదలైంది. రెండు రోజుల క్రితం ‘యునైట్ ది కింగ్డమ్’ అంటూ బ్రిటన్ వాసులు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి, అక్రమ వలసలను తెగనాడుతూ చేసిన ప్రదర్శన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సుమారు లక్షన్నరమంది నిర్వహించిన ఈ ర్యాలీ లండన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిదిగా చెబుతున్నారు. గడచిన పదేళ్లలో బ్రిటన్‌కు వలసలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయన్నది వాస్తవం.

రెండేళ్ల క్రితం తొమ్మిది లక్షలమంది బ్రిటన్‌కు వలసవస్తే, గత ఏడాది ఈ సంఖ్య ఏడు లక్షలుగా ఉంది. ఈ విషయం గమనించిన తాజా ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవలే వలస విధానాలను కఠినతరం చేస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. వీటివల్ల రానున్న నాలుగేళ్లలో వలసలు బాగా తగ్గుతాయని ఆయన చెబుతున్నా, ప్రస్తుత పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా సముద్రమార్గంలో పడవల్లో తరలివస్తున్న అక్రమ వలసదారులు ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమిస్తున్నారు. వీరికి దేశంలో ఆశ్రయం కల్పించి ఉపాధి చూపిస్తే, ఇప్పటికే పతనావస్థవైపు పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలుతుందన్న భయంతో బ్రిటిష్ ప్రభుత్వం వారికి హోటళ్లలో తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తోంది. ఇలా వచ్చిన అక్రమ వలసదారుల వల్ల అడపాదడపా శాంతిభద్రతలకు సమస్య ఏర్పడుతోంది. ఇటీవల ఓ అక్రమ వలసదారుడు ఓ బ్రిటిష్ యువతిపై అత్యాచారానికి పాల్పడటంతో స్థానిక ప్రజలు భగ్గుమన్నారు. వలసదారులు ఎక్కువగా వెళ్లే దేశాలలో అమెరికాదే అగ్రస్థానం. ఆ తరువాతి స్థానాల్లో జర్మనీ, సౌదీ అరేబియా, కెనడా, బ్రిటన్, యుకె, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.

ఇలా ఇతర దేశాలకు వలస వెళుతున్నవారిలో చైనా తరువాత భారతీయులదే అగ్రస్థానం. వలసలపై ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాల వల్ల భారతీయులు.. ముఖ్యంగా విద్యా ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లే యువతపై పెను ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదే పరిస్థితి ఇకపై ఇతర దేశాల్లోనూ ప్రస్పుటమవుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో విద్యా ఉద్యోగావకాశాలు ఇనుమడించేలా ఇప్పటికే ప్రారంభించిన ఆత్మనిర్భర్ వ్యూహానికి భారత ప్రభుత్వం మరింతగా పదునుపెట్టాలి. తయారీ రంగాన్ని బలోపేతం చేస్తూ, స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశ భాగస్వామ్యాన్ని పెంచాలన్న లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు వేయాలి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడిన భారత్ ప్రపంచ దేశాలవైపు చూడటం కాకుండా, ఇకపై ప్రపంచ దేశాలే మనవైపు చూసేలా లోకల్ ఫర్ గ్లోబల్, మేడ్ ఫర్ వరల్డ్ అన్న ఆత్మనిర్భర్ లక్ష్యాలు సాకారమయ్యేందుకు చిత్తశుద్ధితో కృషి చెయ్యడం తక్షణ కర్తవ్యం.

Also Read: అవినీతి పాలకులకు ఇక చుక్కలే!