వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై రిటైర్డ్ ఐపిఎస్ అంజనా సిన్హా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా తన ఐడెంటిటీని తప్పుగా ఉపయోగించారని ఆమె రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ’దహనం’ వెబ్‌సిరిస్‌కు నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ, దర్శకుడు అగస్త్య మంజు. 2022లో చిత్రీకరించిన దహనం వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదు వచ్చింది. కథ రాయల సీమ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. అప్పట్లో అంజనా సిన్హా అక్కడ వివిధ హోదాల్లో పనిచేశారు. ఆమె వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్‌లో ఉపయోగించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజనా సిన్హా ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన అంజన తెలుగు రాష్ట్రాల్లో ఎడిజిపి హోదా వరకూ ఉన్నారు. రాయలసీమలో ఎస్పీగా,డిఐజిగా పనిచేశారు.
‘ఓ స్నేహితుడి ద్వారా నాకు ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. నేను నిర్మాత, దర్శకుడిని ఎప్పుడూ కలవలేదు. మాట్లాడలేదు. ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదు. నా పేరుతో, నా ప్రొఫెషనల్ ఐడెంటిటీతో ఈ సిరీస్‌ను నరేట్ చేసినట్లు చూపించడం ద్వారా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు.ఈ సిరిస్ మొత్తం హింసాత్మక దృశ్యాలు, సెక్సువల్ కంటెంట్ ఉంది. ‘ అని ఫిర్యాదులో వెల్లడించారు. అభ్యంతరకరమైన వెబ్‌సిరీస్‌లో తన ఐడెంటిటీని వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి తన ప్రతిష్ట, గౌరవం, ప్రొఫెషనల్ స్టాండింగ్‌కు తీవ్ర నష్టం కలిగించాయని పేర్కొన్నారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని, మానసికంగానూ కలత చెంది నట్లు వెల్లడించారు. ధహనం 2022లో ఎంఎక్స్ ప్లేయర్‌లో విడుదలైంది. అయితే తరువాత ప్లాట్‌ఫాం నుండి తొలిగించారు. ఈ వెబ్ సిరీస్‌ను రామ్ గోపాల్ వర్మ నిర్మించగా, అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. అభిషేక్ దూహన్, ఇషా కోప్పికర్ ముఖ్య పాత్రల్లో నటించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్, ఒక కమ్యూనిస్ట్ కార్మికుడి హత్య అనంతరం ప్రతీకార కథ చుట్టూ తిరుగుతుంది.
ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు నిర్మాత, దర్శకుడిపై ఐపిసి సెక్షన్లు 509, 468, 469, 500, 120(బి) కింద కేసు నమోదు చేశారు. రామ్‌గోపాల్‌వర్మకు ఇలాంటి కేసులు కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఆయన సినిమాలు చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నాయి. సినిమాల ద్వారా ట్వీట్ల ద్వారా ప్రతి ఒక్కరికి కెలికి ఆనందపడే రామ్‌గోపాల్‌వర్మపై చాలా కేసులే ఉన్నాయి. ఎపిలో జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలుగుదేశాన్ని రెచ్చగొట్టేలా సోషల్‌మీడియా పోస్టులు, చంద్రబాబు, లోకేష్‌లను కించ పరిచేలా సినిమాలు తీశారాయన. వాటిపై ఎపిలో ప్రభుత్వం మారిన తర్వాత ఫిర్యాదులు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్‌లను అనుచితంగా చూపించారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. అంతకు ముందు ఆయనపై చెక్‌బౌన్స్, కాపీరైట్ కేసులు కూడా ఉన్నాయి
Also Read: త్వరలో కిషోర బాలికా సంఘాలు : మంత్రి సీతక్క