ఫీజుల చర్చలు సఫలం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్ర భుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో ప్రస్తుతం రూ.600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని తెలిపింది. దీంతో మంగళవారం ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వ తీరును నిరసి స్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు సోమవారం(సెప్టెంబర్ 15) నుంచి నిరవధిక బం ద్‌కు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు అంశం పై ఆదివారం అర్థరాత్రి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రైవేట్ యాజమాన్యాలతో చ ర్చించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు సోమవారం కాలేజీలు మూసివేసి బంద్‌ను పాటించాయి.

ఈ అంశంపై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క,మంత్రి శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం మంత్రులు, కళాశాల యాజమాన్యాలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ..విద్యార్థుల భవిష్యత్తు తె లంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం అని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప థకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంలాంటిదని వ్యాఖ్యానించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని, పదేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పెండిగ్‌లో పెట్టి భారంగా మార్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన అంశాలను తాము క్రమక్రమంగా సరిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.

ఈ పథకానికి సంబంధించి కళాశాలల వద్ద రూ.600 కోట్ల విలువైన టోకెన్లు ఉన్నాయని, ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ.600 కోట్ల నిధులు ఈ వారంలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు కళాశాలల బంద్‌ను విరమించుకున్నట్లు యాజమాన్యాలు చెప్పాయని, బంద్ విరమణకు ముందుకొచ్చిన యాజమాన్యాలకు డిప్యూ టీ సిఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై సమస్య తలెత్తకుండా యాజమాన్యాల ప్రతినిధులు కొన్ని సూచనలు చేశారని, దాని లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ కోసం కమిటీని నియమిస్తామని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో అధికారులు, యాజమాన్యాలతో కలిసి కమిటీని ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

సమ్మె విమరిస్తున్నాం: ఫెడరేషన్ చైర్మన్ రమేష్
తమ కష్టాలను అర్థం చేసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.600కోట్లు ప్రభుత్వం విడుదల చేయ డం శుభసూచికం అని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) చైర్మన్ రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టం హామీ లభించిన నేపథ్యంలో తాము తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాము ఎప్పుడూ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకారం అందించామని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.

Also Read: కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి