దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి

బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను సవిత తల్లి కిందకు తోసి హత్య చేసిిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సవితి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఆగస్టు 27న బీదర్ పట్టణంలోని ఆదర్శ్ కాలనీలో జరిగింది. 6 సంవత్సరాల బాలిక సాన్వి మూడవ అంతస్తు నుండి అకస్మాత్తుగా కింద పడి మరణించిందని మొదట ఫిర్యాదు అందింది. ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన గదిలో నిద్రపోతున్నానని, ఏమి జరిగిందో తనకు తెలియదని ఆ చిన్నారి సవతి తల్లి రాధ.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పింది.

అయితే ఈ సంఘటన పొరుగింటి వారి సిసిటివి కెమెరాలో రికార్డైంది. రెండు వారాల తర్వాత పొరుగింటి వ్యక్తి ఫుటేజ్‌ను చూసి షాక్ అయ్యాడు. అతను వెంటనే సాన్వి తండ్రి సిద్ధాంత్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో సిద్ధాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితురాలు రాధను అరెస్టు చేశారు.