త్వరలో కిషోర బాలికా సంఘాలు : మంత్రి సీతక్క

మహిళా స్వయం సహాయక బృందాల తరహాలోనే కౌమార బాలిక సంఘాలను ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటు పై అధికారులకు మంత్రి సీతక్క దిశ నిర్దేషం చేశారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపవచ్చని మంత్రి పేర్కొన్నారు. బేగంపేటలోని జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, సాధికారత అంశాలపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని సెర్ప్, మహిళా-శిశు అభివృద్ధి శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో డిఆర్‌డిఓలు, అదనపు డిఆర్‌డిఓలు, డిడబ్లుఓల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు జీవితంలో అత్యంత కీలక దశ అని, ఈ దశలో సరైన మార్గదర్శకం ఇస్తే కౌమార బాలికలు సమాజానికి దారి దీపమవుతారని అన్నారు. బాల్యవివాహాలు, చదువు మానేయడం, రక్తహీనత, పోషక లోపం, వేధింపులు వంటి ఎన్నో సవాళ్లు కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారత అని స్పష్టం చేశారు.

మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలోనే కిశోర బాలిక సంఘాలను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. డిఆర్‌డిఓలు, డిడబ్లుఓలు ఈ సంఘాల ఏర్పాటులో భాగస్వాములు కావాలని, ఇలాంటి సంఘాల ద్వారా బాలికల సమస్యలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. కిశోర బాలికల భద్రత, పోషకాహారం, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనలో ఈ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ, అటవీ ప్రాంతాల బాలికల సమస్యలు వేర్వేరుగా ఉంటాయని, వాటి స్వభావానుసారం నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమాజంలో వ్యాపిస్తున్న అనేక రుగ్మతలకు చెక్ పెట్టగల శక్తి కిశోర బాలిక సంఘాల్లో ఉందని,

వీటిని బలోపేతం చేస్తే బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమగ్ర పరిష్కారం లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గ్రామాల వారీగా అధికారులు ఈ సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని ఆమె పిలుపు నిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5.15 లక్షల మంది కౌమార దశ బాలికలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, అదనపు సీఈఓ కాత్యాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి. సృజన, యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్, కౌమార, యువజన అభివృద్ధి అధికారి ఎం. మురళీకృష్ణ, తరుణి సంస్థ చైర్‌పర్సన్ మమత రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి